PM Modi France Visit: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా ప్రారంభమైన బాస్టిల్ డే పరేడ్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో కలిసి మోదీ పరేడ్ ను వీక్షించారు. ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా బాస్టిల్ డే పరేడ్ కు పేరుంది. ఇందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటున్నాయి. భారత సాయుధ దళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందం.. ఫ్రాన్స్ దళాలతో కలిసి ఈ పరేడ్ లో పాల్గొంది. దీంతో పాటు భారత్ కు చెందిన నాలుగు రఫేల్ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్లు పారిస్ గగనతలంలో విన్యాసాలు చేశాయి. అంతకు ముందు ఎలీసీ ప్యాలెస్ లో ప్రధాని మోదీకి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 


ఇండియా- ఫ్రాన్స్ సీఈవో ఫోరమ్ కు ఇద్దరు నేతలు హాజరు కానున్నారు. సాయంత్రం తర్వాత, ప్యారిస్ లోని ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం కాంప్లెక్స్ లో మోదీకి మక్రాన్ విందు ఇవ్వనున్నారు. 



ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. భద్రత, పౌర అణు సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, సైబర్ భద్రత, అంతరిక్షం, వాతావరణ మార్పు, సరఫరా గొలుపు సమన్వయం సహా పలు సహకార రంగాలపై మోదీ, మక్రాన్ ల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు. 






అలాగే అంతరిక్ష రంగంలో సహకారానికి కొత్త అవకాశాలను ఇరువురు నేతలు అన్వేషించాలని భావిస్తున్నట్లు క్వాత్రా పేర్కొన్నారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల విస్తరణ ప్రధాన మంత్రి మోదీ పర్యటనలో కీలకంగా ఉంటుందని తెలిపారు. ఫ్రాన్స్ నుంచి 26 నేవీ రాఫెల్ జెట్ లను భారత్ కొనుగోలు చేయడం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. భారత్ లో ఎయిర్‌ క్రాఫ్ట్ ఇంజిన్ ను సంయుక్తంగా అభివృద్ధి చేసే విషయంపై ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా చర్చలు జరగనున్నట్లు తెలిపారు. 






మోదీ ఫ్రాన్స్ పర్యటన, వ్యూహాత్మక, సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యా, ఆర్థిక సహకారంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పుకొచ్చింది.


స్వాగతం అంటూ హిందీ ట్వీట్ చేసిన మక్రాన్


ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. ఫ్రాన్స్‌కి స్వాగతం అంటూ హిందీలో ట్వీట్ చేశారు. పారిస్‌కి వచ్చిన మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనను చాలా కీలకంగా భావిస్తున్నాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే మేక్రాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 


"భారత్ ఫ్రాన్స్ మధ్య ద్పైపాక్షిక బంధాలు బలపడి పాతికేళ్లు అవుతోంది. ఇప్పటికీ అదే విశ్వాసంతో పరస్పరం సహకరించుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ బంధం మరింత బలోపేతం అవుతుంది. నరేంద్ర మోదీజీ వెల్‌కమ్‌ టు ప్యారిస్" - ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial