Earthquake Hits Nepal, Strong Tremors Felt in Delhi, check details: నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.8గా నమోదు అయింది. నేపాల్ లో భూకంప ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో కనిపించింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్ సహా ఉత్తర బారతంలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు వ్చచాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రతకు ఇంట్లోని వస్తువులు కదిలిన దృశ్యాలను దిల్లా వాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


భూ ప్రకంపనల ధాటికి ఫ్యాన్సు, షాండ్లియర్ ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఢిల్లీలో భూమి కంపించడం ఈ నెలలోనే ఇది మూడోసారి కావడం గమనార్హం. అయితే ఉత్తరాఖండ్ లోని పితోరగఢ్ కు 148 కిలో మీటర్ల దూరంలో నేపాల్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. 


న్యూ ఇయర్ రోజే భూకంపం 
కొత్త ఏడాది మొదటి రోజే దేశ రాజధాని ప్రజలను తెల్లవారుజామునే భూకంపం భయపెట్టింది. National Center for Seismology (NCS) వివరాల ప్రకారం..ఢిల్లీ NCR ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైందని అధికారులు తెలిపారు. హరియాణాలోని ఝజ్జర్‌ ప్రాంతంలో భూమి కాసేపు కంపించినట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 1.19 గంటలకు ఈ భూకంపం వచ్చినట్టు వెల్లడించారు. 5 కిలోమీటర్ల లోతు మేర భూకంప తీవ్రత కనిపించిందని పేర్కొన్నారు.






2015లోనూ భారీ భూకంపం.. తొమ్మిది వేల మంది మృతి


పశ్చిమ నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్రత 5.9గా నమోదైందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ హెడ్‌ మోనికా దహల్‌ తెలిపారు. పొరుగున ఉన్న భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇది కనిపించిందన్నారు. అలాగే 2015 ఏప్రిల్ లో కూడా నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో  దాదాపు 9,000 మంది మృతి చెందగా.. 22 వేల మందికి పైగా గాయపడ్డారు. అలాగే 8 లక్షల ఇళ్లు, వందల సంఖ్యలో పాఠశాల భవనాల ధ్వంసం అయ్యాయి. 


ఏడేళ్లలో 600కు పైగా భూకంపాలు - ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి


నేపాల్, మిగిలిన హిమాలయ ప్రాంతంమంతా పశ్చిమాన హిందూకుష్ పర్వత శ్రేణుల నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో అత్యధిక భూకంపాలకు గురయ్యే ప్రాంతాలలో ఒకటి. భారత కాంటినెంటల్ ప్లేట్ ఉత్తరం వైపు కదలిక, యురేషియన్ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా ప్రకంపనలు ఏర్పడతాయి. అలాగే గత ఏడేళ్లలో హిమాలయ ప్రాంతంలో 4.5 కంటే ఎక్కువ తీవ్రతతో 600కు పైగా భూకంపాలు నమోదు అయ్యాయి. ఈ ప్రాంతం ఇటీవలి కాలంలో కొన్ని బలమైన భూకంపాలను కూడా చూసింది. ఈ ప్రాంతంలో ఉపరితలం కింద భారీ మొత్తంలో ఒత్తిడి శక్తి నిల్వ చేయబడిందని, అది ఎప్పుడైనా భారీ భూకంపానికి దారితీయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.