BBC Documentary: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" పై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా అనేక ఇతర పార్టీలు ఈ డాక్యుమెంటరీపై వివిధ రకాల ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిషేధించింది. 


అసలేంటీ డాక్యుమెంటరీ..?


నిజానికి "ఇండియా:క్వశ్చన్ ద మోదీ" డాక్యుమెంటరీ అనేది 2002 గుజరాత్ అల్లర్ల గురించి వర్ణించే రెండు భాగాల సిరీస్. ఈ డాక్యుమెంటరీలో ఆ సమయంలోని రాజకీయ పరిస్థితులు, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు చూపించారు. ఈ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ ను జనవరి 17వ తేదీన బ్రిటన్ లో ప్రసారం చేశారు. ఇందులో మోదీ రాజకీయాల అంశాలను ప్రస్తావించారు. ఇందులో మోదీకి వ్యతిరేకంగా చాలా విషయాల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. ఆ కాలంలో మోదీ పాలనపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అల్లర్లలో దాదాపు 2 వేల మంది చనిపోయారని.. గుజరాత్ అల్లర్ల అసలు కథను ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చని పేర్కొన్నారు.


భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే?


ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ డాక్యుమెంటరీని దుష్ప్రచారంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అభివర్ణించారు. ఈ డాక్యుమెంటరీ ఏక పక్షంగా ఉందన్నారు. అందువల్లే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన నిషేధిస్తున్నామని ప్రకటించారు. ట్విట్టర్,  యూట్యూబ్ ఛానెళ్లలో ఉన్న ఈ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 


కాంగ్రెస్ ఏం చెప్పింది?


డాక్యుమెంటరీపై నిషేధాన్ని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. కేంద్రప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఎలా అడ్డుకుంటుంది, ఏది తప్పో, ఏది ఒప్పో ప్రజలనే నిర్ణయించుకోనివ్వాలని అన్నారు. 2002లో ప్రధాని వాజ్‌పేయి ఎందుకు తన పదవిని విడిచిపెట్టారని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్.. "ఈ డాక్యుమెంటరీ మోదీ అసలు రూపాన్ని చూపుతోందంటూ  ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లను తనకు సంబంధం లేకుండానే ప్రభుత్వం తొలగించిందని చెప్పుకొచ్చారు. 


 ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్, ట్విట్టర్ నుంచి తొలగించగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ డాక్యుమెంటరీని చూపించినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూడా అధికారులకు ఫిర్యాదు చేసింది. క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని చూశారని ఆరోపించింది. అదే సమయంలో దీన్నిఢిల్లీలోని జేఎన్‌యులో కూడా ప్రదర్శించాల్సి ఉందని.. కానీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్సీయూలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 


యూనివర్శిటీ క్యాంపస్‌లో బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" ను ప్రదర్శించారని.. దీని విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా.. జేఎన్యూలో విద్యార్థుల బృందం ఇవాళ(జనవరి 24న తేదీన) ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నట్లు తెలిసిందని సమాచారం వచ్చినట్లు వివరించారు. ఇలాంటి డాక్యుమెంటరీ క్యాంపస్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.