తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. 


కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత తాను చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో బహిర్గతమైందని పార్టీ నాయకులకు వివరించారు బండి సంజయ్‌. తెలంగాణ వ్యాప్తంగా తాను ఐదు విడుతల్లో యాత్ర చేపట్టానని.. దాని విజయవంతంగా నడిపిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు సంజయ్. ఈ యాత్ర సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ గోడు వెల్లబోసుకున్నారని... అనేక సమస్యలను తమ దృష్టి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన అన్ని వర్గాలను తీవ్ర నిరాశ నిస్పృహలకు కారణమైందని విమర్శించారు. ఆయన కుటుంబాన్ని తప్ప ఏ వర్గాన్ని పాలనతో సంతృప్తి పరచలేకపోయారని ధ్వజమెత్తారు. 






సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీగా బీజేపీని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు బండి సంజయ్‌. అందుకే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో అని అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అ దిశగానే నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 






ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో వేటిని కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు బండి సంజయ్. రజాకార్ల విధానంలో అవినీతితో పాలన సాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదన్నారు. మళ్లీ పాలన గాడిలో పడాలన్నా అభివృద్ధి సాధించాలన్నా తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలని తెలిపారు బండి సంజయ్.






తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పేరుతో దేశ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్. ఇక్కడ డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు, దళిత బంధ్‌, రైతు బంధ్‌, ఇతర ప్రభుత్వ పథకాలను సరిగా ప్రజలకు అందించేలని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని నిలదీశారు. తెలంగాణలో ప్రశ్నించిన వ్యక్తులపై కేసులు పెట్టిస్తున్నారని... ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇక్కడ స్వేచ్ఛలేదన్నారు. 


త్వరలోనే జిల్లా, మండల కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్టు బండి సంజయ్‌ వివరించారు. జాతీయ కార్యవర్గంలో తీసుకున్న  నిర్ణయాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అందరూ పని చేయాలని సూచించారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన జేపీ నడ్డాకు రాష్ట్ర కార్యవర్గంలో మొదటిగా అభినందనలు చెప్పింది.