Pakistan Economic Crisis: పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దానికి తోడు రోజుకో సమస్య వెంటాడుతోంది. సోమవారం పాకిస్థాన్‌ వ్యాప్తంగా విద్యుత్‌ సమస్య తలెత్తింది. నేషనల్ గ్రిడ్‌లో ఏర్పడ్డ సమస్యల కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు వందల మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పొరుగు దేశం పాకిస్థాన్ అల్లాడుతోంది. 


నేషనల్ గ్రిడ్ లో వైఫల్యం- చీకట్లో దేశం


సోమవారం పాకిస్థాన్ నేషనల్ గ్రిడ్‌ ఫెల్యూర్ కారణంగా విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో ఆ దేశంలో అంధకారం అలుముకుంది. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోయారు. ప్రధాన నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ లాంటి ప్రధాన నగరాల్లోనూ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉదయం 7.30 ప్రాంతంలో నేషనల్ గ్రిడ్ లో సమస్య తలెత్తింది అయితే వెంటనే పునరుద్ధరణ చర్యలు ప్రారంభించామని.. 12 గంటల్లో విద్యుత్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని ఆ దేశ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రమ్ అన్నారు. 


దానివల్లే గ్రిడ్ వైఫల్యం!


ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడీ ప్రయత్నాలే గ్రిడ్‌ వైఫల్యానికి కారణమని తెలుస్తోంది. విద్యుత్తును ఆదా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల రాత్రి వేళ డిమాండ్‌ తగ్గడంతో రాత్రిపూట విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ నిలిపివేశారు. ఉదయం మళ్లీ ప్రారంభించగానే వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఒకదాని తర్వాత ఒకటి విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోయాయి.


పెరుగుతోన్న నిరుద్యోగ రేటు


పాకిస్థాన్ లో నిరుద్యోగిత రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వేలాదిమంది పాకిస్థానీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి తోడు పాక్ కు చెందిన డాన్ వార్తాపత్రిక ఇచ్చిన నివేదిక ఆ దేశ ప్రధానితో సహా అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో ఆ దేశంలో నిరుద్యోగుల సంఖ్య 62.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ ప్రకారం నిరుద్యోగుల సంఖ్య పెరిగితే అది దేశ అభివృద్ధిని మరింత కుంగదీస్తుంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశానికి ఇది మరింత ఆందోళన కలిగించే అంశం ఇది.  జనవరి 13 నాటి డేటా ప్రకారం, ఇప్పుడు పాకిస్తాన్ వద్ద కేవలం 4.6 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్‌లో రిఫైనరీలు, వస్త్రాలు, ఇనుము, ఆటోమొబైల్స్, ఎరువులకు సంబంధించిన ఉత్పత్తులు గత కొన్ని నెలలుగా సరిగ్గా నడవడంలేదు. అవి మూసివేత దిశగా సాగుతున్నాయి.