మరణవాంగ్మూలంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణవాంగ్మూలం అంటే విశ్వసించ దగిన...నమ్మకం కలిగించేలా ఉండాలని స్పష్టం చేసింది. వ్యక్తులు చనిపోయే ముందు ఇచ్చే మరణవాంగ్మూలం ప్రామాణికతపై ఎలాంటి అనుమానాలు ఉన్నా...దాన్ని ఓ సాక్ష్యంగా మాత్రమే తీసుకోవాలని తెలిపింది. ఓ కేసులో ఉరిశిక్ష పడిన నిందితుడ్ని విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 


ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన నిందితుడు ఇర్ఫాన్‌కు 2017లో ట్రయల్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. తన కుమారుడు, ఇద్దరు సోదరులు నిద్రిస్తున్న గదికి నిప్పటించి... వారిని హత్య చేశాడన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో చనిపోయే ముందు కుటుంబసభ్యులు ఇచ్చిన మరణవాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. దీని ఆధారంగా ట్రయల్ కోర్టు...ఇర్ఫాన్ కు మరణశిక్ష విధించింది.  


రెండో వివాహానికి...తన మొదటి భార్య కుమారుడు, సోదరులు అడ్డుగా నిలుస్తున్నారనే కారణంతో...ఇర్ఫాన్ ఇంటికి నిప్పంటించాడని ట్రయల్ కోర్టులో తీర్పులో వెల్లడించింది. నిందితుడు అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లడంతో...కింది కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో నిందితుడు ఇర్ఫాన్...అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ప్రశాంత కుమార్‌ మిశాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం...అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేదు. 


చనిపోయే దశలో ఉన్న ఇర్ఫాన్‌ ఇద్దరు సోదరులిచ్చిన వాంగ్మూలాలపై అనుమానం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం... చనిపోయే ముందు వ్యక్తి కచ్చితంగా నిజమే చెబుతాడన్న గ్యారెంటీ లేదని అభిప్రాయపడింది. వ్యక్తులు చివరి దశలో ఇచ్చే వాంగ్మూలాల్లో నిజానిజాలను న్యాయస్థానాలు మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మరణ వాంగ్మూలాలు, సాక్షుల వాంగ్మూలాలు  మధ్య తేడాలు ఉన్నాయని తెలిపింది. 36 పేజీల తీర్పులో మరణవాంగ్మూలాల చట్టబద్ధత, విశ్వసనీయతపై కొన్ని కీలక అంశాలను వివరించింది. ఉరిశిక్ష పడిన నిందితుడ్ని తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.