Microchip Shortage: కరోనా తెచ్చిన వివిధ సమస్యల్లో మైక్రో చిప్ సమస్య కూడా ఒకటి. అప్పుడు మొదలైన మైక్రోచిప్ ల కొరత ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మైక్రోచిప్ ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆటో మొబైల్స్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్లు, గ్రాఫిక్ కార్డ్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. భారత్ లోని ఆటో మొబైల్ కంపెనీలు కూడా మైక్రో చిప్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ కొరత ప్రభుత్వ రంగ సంస్థలపైనా పడింది. మైక్రో చిప్ ల కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్మార్ట్ కార్డు ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీ కార్డులు) జారీ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అన్ని రకాల పరిశ్రమలు మూత పడటంతో మైక్రో చిప్ లను ఉత్పత్తి చేసే కంపెనీలు వాటి తయారీని ఆపేశాయి. తర్వాత కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కసారిగా మైక్రో చిప్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేక వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో మైక్రో చిప్ లను దిగుమతి చేసే కంపెనీలు వెనకా ముందూ చూసుకుంటూ ఆచితూచి వ్యవహరించడం మొదలు పెట్టాయి. అలాగే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఈ నేపథ్యంలో మైక్రో చిప్ లు దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలే తాజాగా దేశంలో డ్రైవింగ్ లైసెన్సు జారీ, ఆర్‌సీ కార్డుల జారీ ఆలస్యం అవుతోంది.
తెల్లబంగారంలా మారిన సిలికాన్
మైక్రోచిప్‌ల తయారీలో అత్యంత ముఖ్యమైన ముడి పదార్థం సిలికాన్. దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా ఉంది. కానీ నాణ్యమైన సిలికాన్ మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది. మెరుగైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అత్యంత నాణ్యమైన ముడిపదార్థాలు అవసరం. స్ఫటిక శిలల్లో నాణ్యమైన సిలికాన్ దొరుకుతుంది. అంత నాణ్యమైన స్ఫిటిక రాళ్లు అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న స్ప్రూన్ పైన్ ప్రాంతంలో దొరుకుతాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి మొబైల్ ఫోన్, కంప్యూటర్ చిప్ లోనూ స్ప్రూన్ పైన్ గనుల్లో వెలికితీసిన సిలికాన్ ఉంటుంది. స్ప్రూన్ గనుల్లో చాలా ఏళ్ల క్రితం నుంచి తవ్వకాలు జరుపుతున్నాయి. 1980లలో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి చెందడంతో ఈ సిలికాన్ తెల్ల బంగారంలా మారిపోయింది.
పెద్ద పెద్ద రాళ్లను కంకరగా మారుస్తారు. అనంతరం వాటిని కంకర ఇసుకలా మార్చేస్తారు. తర్వాత వాటికి నీళ్లు రసాయనాలు కలుపుతారు. ఆ తర్వాత పౌడర్ లా తయారు చేసి మరో రిఫైనరీకి పంపుతారు. ఈ పౌడర్ ను కొలిమిలో కరిగించి స్తూపాకార కడ్డీలుగా మారుస్తారు. డిజైన్ ను బట్టి వెయ్యి నుంచి 2 వేల ప్రత్యేక దశలను దాటుకుని సిలికాన్ చిప్ తయారు చేస్తారు. స్ప్రూన్ పైన్ గనుల్లో ఏటా 30 వేల టన్నుల సిలికాన్ మాత్రమే తీస్తున్నారు. వాటితో ప్రతి సంవత్సరం వందల కోట్ల మైక్రోచిప్ లు తయారు చేస్తారు.