Viral Video:
ట్రెకర్స్‌కి పనిష్‌మెంట్
గోవా కర్ణాటక బార్డర్‌లోని దూద్‌సాగర్ ఫాల్స్ వద్ద ట్రెకింగ్ ఓ స్పెషల్ అట్రాక్షన్. ఎప్పుడూ ఈ ఏరియా టూరిస్ట్‌లతో సందడిగా ఉంటుంది. అయితే...ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయాలని వచ్చిన ఓ ట్రెకింగ్ బ్యాచ్‌కి షాక్ ఇచ్చారు రైల్వే పోలీసులు. ఈ దూద్‌సాగర్ వద్ద ట్రైన్ దిగి పట్టాలు దాటి ఫాల్స్ దగ్గరికి రావడం చట్టరీత్యా నేరం. అందుకు అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వరు. అయినా...ఓ బ్యాచ్ దిగాల్సిన స్టేషన్ కన్నా ముందే దిగి రైల్వే ట్రాక్‌లు దాటుకుని దూద్‌సాగర్ ఫాల్స్ వద్ద ట్రెకింగ్ చేసింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే స్పాట్‌కి వెళ్లారు. పర్మిషన్ లేకుండా ఇలా ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆ తరవాత వాళ్లకు పనిష్‌మెంట్ కూడా ఇచ్చారు. అందరితోనూ గుంజీలు తీయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షాకాలంలో ఈ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి. చాలా మంది మాన్‌సూన్ కోసం ఎదురు చూసి మరీ ఇక్కడికి వస్తుంటారు. బెంగళూరు, మంగళూరు, బెల్గావి, ఉత్తర కర్ణాటక, హుబ్బలి దార్వాడ్, పుణే, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున పర్యాటకులు తరలి వస్తారు. సౌత్ గోవాలోని కొల్లెం స్టేషన్ వద్ద రైలు దిగి అక్కడి నుంచి పట్టాలు దాటి ఇక్కడికి చేరుకుంటారు.
ప్రమాదకరం..
అయితే...వర్షాకాలంలో అక్కడ ట్రెకింగ్ చేయడం ప్రమాదకరం అని గతంలోనే రైల్వే పోలీసులు హెచ్చరించారు. ఏ కాస్త తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదమని తేల్చి చెప్పారు. గోవా ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గానే ఉంది. గతంలో ఇక్కడికి వచ్చిన ఇద్దరు టూరిస్ట్‌లు నీళ్లలో మునిగిపోయి చనిపోయారు. ఇంత వార్నింగ్ ఇచ్చినా ఓ బ్యాచ్ దూద్‌సాగర్ ఫాల్స్ వద్దకు రావడంపై రైల్వే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వాళ్లకు ఇలా పనిష్‌మెంట్ ఇచ్చారు. సౌత్ వెస్టర్న్ రైల్వే కూడా ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు పెట్టింది. రైల్లో నుంచి దూద్‌సాగర్ అందాలను ఆస్వాదించాలని, దిగి పట్టాలు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించింది. ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది. ఈ రూల్ అతిక్రమించిన వారికి రైల్వే యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వీడియోపై నెటిజన్‌లు స్పందిస్తున్నారు. కొందరు పోలీసులకు సపోర్ట్‌గా కామెంట్స్ పెట్టారు. ట్రెకింగ్‌కి ముందు మంచి వార్మప్ అని కొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు.
Also Read: US Flights Cancelled: అమెరికాలో భారీ వర్షాలు వరదలు, వేలాది ఫ్లైట్‌ల సర్వీస్‌లు రద్దు - ఇటలీలోనూ ఇంతే