Bengaluru Crime News: బెంగుళూరులో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో మహిళలను మోసం చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్న ఓ వ్యక్తి బాగోతం బయటకు వచ్చింది. పదేళ్లలో మొత్తం పదిహేను మందిని పెళ్లి చేసుకున్న ఇతడికి ముగ్గురు భార్యల వల్ల ఐదుగురు పిల్లలు పుట్టారు. అలాగే వీరి వద్ద నుంచి మొత్తం మూడు కోట్ల రూపాయలు కొట్టేశాడు. అయితే చివరగా చేసుకున్న పెళ్లితో ఇతడి బాగోతం అంతా బట్టబయలు అయింది. ఇవే కాదండోయ్ ఈయనను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో 9 మందితో కూడా ఇతను ఫోన్ లో మాట్లాడడం, చాటింగ్ చేయడం మరింత గమనార్హం.
బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల మహేష్ నాయక్ కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అయితే పదేళ్లుగా మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో డాక్టర్, ఇంజనీర్‌గా తనను తాను పరిచయం చేసుకుంటూ మహిళలను పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది మొదట్లో ఇతగాడిని పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేయడంతో గత వారం అతన్ని అరెస్ట్ చేశారు.
బెంగళూరులో నివసిస్తున్న 45 ఏళ్ల మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 2022 ఆగస్టు 22వ తేదీన మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా మహేష్‌ను కలిసింది. అయితే నాయక్ మైసూరులో నివాసం ఉంటున్నట్లు, అలాగే తానో ఆర్థోపెడిషియన్ అని ఆమెతో చెప్పుకున్నాడు. అలాగే తనను పెళ్లి చేసుకుంటానని కూడా ఆమెకు చెప్పాడు. ఇలా ఒకరికొకరు నచ్చడంతో ఫోన్‌లు మొదలు అయ్యాయి. 2022వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన నాయక్ ఆ మహిళను మైసూరుకు తీసుకువచ్చాడు. ఓ అద్దె ఇంట్లోకి తీసుకువెళ్లి అది తన సొంత నివాసం అని అలాగే తాను మరో కొత్త క్లినిక్ ప్రారంభించబోతున్నట్లు ఆమెతో చెప్పాడు.
ఈ ఏడాది జనవరి 28న విశాఖపట్నంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో వీరి వివాహం జరిగింది. మరుసటి రోజు వారిద్దరూ మైసూరుకు తిరిగి వచ్చారు. అయితే ఆ మరుసటి రోజు అంటే జనవరి 30వ తేదీన పని ఉందంటూ మూడ్రోజుల పాటు రాలేనని చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తర్వాత రోజే ఆమెకు ఫోన్ చేసి క్లినిక్ ప్రారంభించేందుకు రూ.70 లక్షలు కావాలని అప్పుగా ఇవ్వమని ఆమెను అడిగాడు. అందుకు మహిళ నిరాకరించడంతో బెదిరించాడు. ఫిబ్రవరి 5న మహిళ వద్ద ఉన్న రూ.15 లక్షల నగదు, బంగారాన్ని నాయక్ ఎత్తుకెళ్లాడు. దీంతో ఆమె భర్తకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. దీంతో అతడు ఉంటున్న భార్య.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దగ్గరకు వచ్చి నా భర్తకు ఎందుకు ఫోన్ చేస్తున్నావని గొడవ పడింది. దీంతో అసలు విషయం అర్థం చేసుకున్న మహిళా ఇంజినీర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త ఒకరికి తెలియకుండా ఒకరిని.. మొత్తం ఇద్దరిని పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. దీంతో అతడి మొబైల్ ట్రాక్ చేయగా.. తుమకూరు సమీపంలో ఉన్నాడని గుర్తించారు. అయితే కాల్ లిస్టులో మొత్తం మహిళలే ఉండేసరికి అనుమానం వచ్చిన పోలీసులు.. వారందరినీ పిలిచి మాట్లాడారు. దీంతో వారందరినీ అతడు పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు జులై 9వ తేదీన నాయక్ ను అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలోని అతని ఖాతాని పరిశీలిస్తే.. అతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో తొమ్మిది మంది మహిళలతో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరిశోధకులు ఈ కేసును లోతుగా పిరిశీలించగా.. అతడి బాగోతం మొత్తం బయట పడింది.
5వ తరగతి తర్వాత తన చదువు ఆగిపోవడంతో నాయక్ సినిమాల్లో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అవకాశాల కోసం వెతుకుతూ గడిపాడు. కానీ అవకాశం రాలేదు. దీంతో ఇలా పెళ్లిళ్లు చేసుకుంటూ మహిళలను మోసం చేస్తున్నాడు. అయితే ఇతడికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఉన్నప్పటికీ.. నాయక్ వారితో మాట్లాడడం లేదు. ఇతడిపై 2013లోనే ఓ కేసు నమోదు అయింది. కానీ ఆ కేసులో ఇతడిని ఎంత వెతికినా దొరక్కపోయేసరికి కేసు చివరి దశకు చేరుకుందని పోలీసులు చెబుతున్నారు.
మ్యాట్రిమోనియర్ సైటులో ధనవంతులు, ఒంటరిగా ఉన్న మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఇతను మాట కలిపేవాడు. ఇంజినీరుగా, డాక్టర్ గా బిల్డప్ ఇచ్చేవాడు. కానీ ఇతడికి ఇంగ్లీష్ ఎక్కువగా రాకపోవడంతో చాలా మంది ఇతడికి నో చెప్పారు. ఇంగ్లీష్ వచ్చుంటే బాధితుల సంఖ్య మరింత పెరిగేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతడు మోసం చేసి పెళ్లి చేసుకున్న వారిలో ఓ మహిళ డాక్టర్. ఆమె క్లినిక్ లోనే ఇతడు ఫొటోలు దిగి మిగతా యువతులకు వైద్యుడినని చెబుతూ నమ్మించేవాడు. అలా పెళ్లిళ్లు చేసుకుంటూ వారి వద్ద ఉన్న నగదుతో పాటు నగలను కూడా దోచేసేవాడు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, నగదు దోచుకున్నట్లు తెలుస్తోంది.