విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించరాదని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు మరోసారి నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపే తేదీని ప్రకటించేందుకు నో చెప్పింది. ఈ అంశాన్ని సంచలనం చేయొద్దని సుప్రీం అభిప్రాయపడింది.


హైకోర్టు తీర్పు



కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్​ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్​ ధరించడంపై నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.





ఇస్లాం మతవిశ్వాసాల ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్​ ధరించడం తప్పనిసరి కాదని మేం విశ్వసిస్తున్నాం. దీనినే పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని చెప్పడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం కాదు. అది సహేతుకమైన పరిమితి.యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్. దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాలి                                              "
-కర్ణాటక హైకోర్టు

 

సుప్రీంలో సవాల్


కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు స్వీకరించింది. అయితే అత్యవసర విచారణకు మాత్రం అంగీకరించలేదు. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్​లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో అత్యవసర విచారణ జరపాలని సుప్రీం కోర్టులో మరో పిటిషన్ రాగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది


ఇలా మొదలైంది

 

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవడం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందూ సంఘాలు దీనిని ఖండించాయి. ఇది మొదలైన కొద్ది రోజులకే ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా మారింది. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.


మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ర్యాలీలు చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.



Also Read: Viral News: పిల్లి చేసిన లొల్లి- ఒకటి, రెండు కాదు రూ.100 కోట్ల నష్టం, ఇంకేంటంటే?



Also Read: Russia Ukraine War: 4 వారాల్లో ప్రపంచాన్నే మార్చేసిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- నెగ్గేదెవరు? తగ్గేదెవరు?