రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటికి సరిగ్గా నెల రోజులు. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్లు ఫిబ్రవరి 24 ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఎవరైనా మధ్యలో తల దూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ నెల రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి, ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. ఇది పైకి కనిపించేది. అయితే యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ నెల రోజుల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యే పరస్థితులు కనిపిస్తున్నాయి.
రష్యా మొదలుపెట్టిన ఈ దాడి ఇప్పట్లో పూర్తి కాదని ఐరోపా నిఘా విభాగాలు ముందే అంచనా వేశాయి. అయితే ఇది ప్రపంచాన్నే వణికిస్తుందని మాత్రం అనుకోలేదు. ఉక్రెయిన్‌ను నామ రూపాల్లేకుండా చేయడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఐరోపా దేశాలకు యుద్ధం మొదలైన తర్వాతే అర్థమైంది.
ఉక్రెయిన్ జవాబు
బలమైన రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ కూడా అంతే దీటుగా ఎదుర్కొంటోంది. డజనుకు పైగా ఉన్న మిత్రదేశాలు, అమెరికా కూడా ఉక్రెయిన్‌కు పరోక్షంగా సాయమందిస్తున్నాయి. అన్నింటిని మించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాటలు ఆ దేశ సైన్యాన్ని అలుపెరగకుండా పోరేడేలా చేస్తున్నాయి.
అమెరికా పాత్ర
ఈ నెలరోజుల యుద్ధంలో అమెరికా పాత్ర కూడా ఎక్కువే ఉంది. ముఖ్యంగా అమెరికా ఎన్నడూ చూడని విదేశాంగ విధానాలు ఇప్పడు అవలంబించాల్సి వచ్చింది. ఇప్పటివరకు చైనానే శత్రువుగా చూసిన అమెరికా.. ఈ యుద్ధం వల్ల రష్యాపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ బుధవారం అత్యవసర నాటో సమావేశానికి హాజరయ్యారు. అమెరికా మిత్ర దేశాలు.. రష్యాపై వీలైనన్నీ ఆర్థిక ఆంక్షలు విధించాలని బైడెన్ కోరారు. అయితే అణ్వాయుధాలు కలిగిన రష్యాతో నేరుగా యుద్ధం చేయడం ప్రపంచానికి ప్రమాదకరమని అమెరికా భావిస్తోంది.
ఆయుధ సాయం
రష్యా సైన్యంతో పోరాడేందుకు తమ బలగాలను పంపడానికి ఐరోపా దేశాలు వెనకాడుతున్నప్పటికీ ఆయుధ సామగ్రిని మాత్రం పంపిస్తున్నాయి. పశ్చిమ దేశాల వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతోనే ఉక్రెయిన్.. ఇన్నాళ్లపాటు రష్యాను అడ్డుకోగలిగింది. అయితే ఈ యుద్ధంలో విజయం సాధించడం రష్యా, ఉక్రెయిన్‌కు అంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోజులు గడుస్తోన్న కొద్ది రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత హింసాత్మకంగా మారుతోంది.