ఈ మధ్య కాలంలో జనావాసాల మధ్యలోకి అడవి జంతువులు రావడం సర్వసాధారణ విషయం అయిపోయింది. రెండు రోజుల క్రితం కూడా ముంబైలోని ఓ సీరియల్ సెట్లోకి ఏకంగా ఓ చిరుత తన పరివారంతో కలిసి వచ్చింది. దీంతో బెంబెలేత్తిపోయిన సెట్లోని వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
తాజాగా ఓ చిరుత పులి నాసిక్ లోని ఓ ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నించగా..రెండు కుక్కలు దానిని తరిమికొట్టాయి. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు కావడంతో బయటకు వచ్చింది. ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాసిక్ లోని అద్గావ్ షివార్ ప్రాంతంలోని ప్రభావ్‌కర్ ఇంటిలోకి చిరుత ప్రవేశించింది. అక్కడే నిద్రిస్తున్న ఓ కుక్క పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కాగా అదే సమయంలో కొంచెం పక్కగా నిద్రిస్తున్న మరో కుక్క చిరుతను చూసి గట్టిగా మోరగడంతో రెండో కుక్క కూడా చిరుత మీద అరవడం ప్రారంభించింది.
ఆ సమయంలో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. కానీ...మళ్లీ వెంటనే తిరిగి వచ్చి రెండు కుక్కల మీద దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ కుక్కలు రెండు కూడా దానిని తరిమి కొట్టాయి. ఈ దృశ్యం మొత్తం సీసీ టీవీలో రికార్డు అయ్యింది.
ఈ వీడియోని ఆ ఇంటి యజమాని అయిన ప్రభావ్ కర్ అటవీ అధికారులకు చూపించి, చిరుత ప్రవేశం గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అటవీ శాఖాధికారి వృషాలి గాడే మాట్లాడుతూ..చిరుత పులి ఆ ప్రాంతంలోకి సమీపంలోని పొలాల్లోనుంచి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. చిరుతలు రాకుండా బోనులు ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు.
ముంబైలోని గోరేగావ్ జిల్లాలోని ఫిల్మ్ సిటీలో మరాఠీ టీవీ సీరియల్ "సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా" సెట్స్‌లోకి బుధవారం సాయంత్రం ఒక చిరుతపులి ప్రవేశించింది. దీంతో భయపడిన సెట్లో ని వారు అటుఇటు పరుగులు తీశారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.