Women Hostel Scheme : దేశంలో వివిధ వృత్తులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం సొంత ఊళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. పట్టణాలు, నగరాలకు ఉపాధి నిమిత్తం వెళుతున్న మహిళలకు రక్షణతో కూడిన వసతి దొరకడం చాలా ఇబ్బందిగా మారుతోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం వర్కింగ్‌ వుమెన్‌ హాస్టల్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. స్కీమ్‌లో భాగంగా ఇప్పటికే మహిళలకు వసతి కల్పిస్తున్న భవనాలు విస్తరణ, కొత్త భవనాల నిర్మణాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు ఉపాధి అవకాశాలు లభించే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్కింగ్‌ వుమెన్‌ హాస్టల్స్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలకే ఈ స్కీమ్‌ పరిమితమైంది. ఈ స్కీమ్‌ ప్రధాన ఉద్ధేశం పని చేసే మహిళలకు రక్షణతో కూడిన వసతిని కల్పించడమే. ఈ స్కీమ్‌లో భాగంగా మహిళలకు వసతి కల్పించడంతోపాటు వారి పిల్లలకు డే కేర్‌ సదుపాయాలను కల్పించే కేంద్రాలుగా ఉంటాయి. 


హాస్టల్స్‌లో ఎవరు ఉండవచ్చు.. 


వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్స్‌ స్కీమ్‌లో భాగంగా వసతి గృహాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ హాస్టల్స్‌ నిర్వహణకు అవసరమైన భవనాలు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ హాస్టల్స్‌లో పని చేసే, ఒంటరి, వితంతు, విడాకులు తీసుకున్న, వేరుగా ఉండే, పెళ్లి అయి కుటుంబ అవసరాలు రీత్యా ఒంటరిగా ఉండాల్సి వచ్చిన మహిళలు ఈ హాస్టల్స్‌లో ఉండేందుకు అర్హులు. ఉద్యోగాలు చేసే వారితోపాటు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ పొందుతున్న వాళ్లు కూడా ఈ హాస్టల్స్‌లో ఉండేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో భాగంగా డే కేర్‌ సెంటర్స్‌ కూడా హాస్టల్స్‌లో అందుబాటులో ఉంటాయి. పని చేసే మహిళల పిల్లలు 18 ఏళ్ల వరకు, అబ్బాయిలు అయితే ఐదేళ్ల వయసు వరకు ఇందులో ఉండేందుకు అవకాశం ఉంది. ఈ హాస్టల్స్‌లో ఉండే మహిళలు వేతనం మెట్రోపాలిటిన్‌ సిటీల్లో అయితే రూ.50 వేలకు మించకూడదు. ఇతర నగరాల్లో అయితే రూ.35 వేలకు మించకూడదు. ఈ హాస్టల్స్‌లో ఉండే మహిళలు నెలకు నామమాత్రపు రెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. 


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..?


ఈ వర్కింగ్‌ వుమెన్‌ హాస్టల్‌ స్కీమ్‌కు ప్రభుత్వశాఖలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు, వుమెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లు, అర్బన్‌ మున్సిపల్‌ బాడీస్‌, పంచాయతీ రాజ్‌, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌, గుర్తింపు పొందిన కాలేజీలు, యూనివర్శిటీలు, సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా హాస్టల్స్‌ నిర్వహణకు అవసరమైన భవనాలు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రోగ్రామ్‌ను అమలు చేసే ఏజెన్సీలు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే ఏజెన్సీలు 25 శాతం చొప్పున భవన నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. 


అనేక నగరాల్లో హాస్టల్స్‌


దేశంలోని అనేక నగరాల్లో ఈ హాస్టల్స్‌ను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్స్‌లో ఉండేందుకు వేతనంలో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మూడు పూట్ల ఆహారంతోపాటు వసతి అందిస్తారు. వీటిపై ప్రభుత్వశాఖల పర్యవేక్షణ ఉంటుంది. జిల్లా స్థాయిలో స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే సంస్థల ఎంపికకు సంబంధించి కలెక్టర్‌ మానిటరింగ్‌ ఉంటుంది. ఎక్కువగా ఈ హాస్టల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వశాఖలు మాత్రమే ముందుకు వస్తున్నాయి. దాదాపు ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ పరిధిలోని సంస్థలే ఇప్పటి వరకు వీటిని అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేశాయి. 


అద్దె చెల్లింపు ఇలా 
సింగిల్ బెడ్ రూమ్‌ కోసం – మొత్తం జీతంలో గరిష్టంగా 15% 
డబుల్ బెడ్ రూమ్‌ కోసం – మొత్తం జీతంలో గరిష్టంగా 10% 
డార్మిటరీ కోసం – మొత్తం జీతంలో గరిష్ఠంగా 7.5% 
పిల్లలకు డే కేర్ సెంటర్ సౌకర్యాలు పొందడం కోసం – తల్లుల గరిష్ట జీతం 5% 


ఈ అద్దెలో మెస్‌, యూజర్ ఛార్జీలు వసూలు, వాషింగ్ మెషీన్‌ వంటి ఇతర సౌకర్యాలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో మహిళలు మూడు ఏళ్ల కంటే ఎక్కువ రోజులు వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో ఉండటానికి వీలు లేదు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతి ఇస్తారు. అది కూడా ఆరు నెలల వరకు పొడిగిస్తారు. ఇది కూడా ఐదేళ్ల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత పొడిగింపు సౌకర్యం కూడా ఉండదు.