Lok Sabha Elections 2024: ప్రజాస్వామ్యానికి అతి ప్రాధాన్యమైన ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ మొదైలైంది. ఉదయం ఆరు గంటలకే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎండలు మండిపోతున్న వేళ... ఉదయాన్నే ఓటు వేసి వెళ్లిపోవాలని వీఐపీలు, వృద్ధులు పోలింగ్ బూత్‌ వద్ద బారులు తీసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 


తమిళనాడులో 39 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైతే... రాజకీయ, సినీ రంగ ప్రముఖులు వచ్చి ఓట్లు వేస్తున్నారు. హీరో అజిత్‌, మాజీ గవర్నర్‌ తమిళిసై, మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం మొదలైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతోంది. పోలింగ్‌ ముగిసినప్పటికీ క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 


పావుగంట ముందుగానే 
తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో హీరో అజిత్‌ పావుగంట ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అందరితోపాటు క్యూలో నిల్చొని ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తమిళనాడులోని 39 లోక్‌సబ నియోజకవర్గాలతోపాటు రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌పర్దేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో ఆరు, మహారాష్ట్రలో ఐదు పార్లమెంట్ స్థానాలకి కూడా మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. భారీగా ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. 


ఆసక్తికరమైన అంశం
మణిపూర్‌లో జరుగుతున్న పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 16వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. కొందరు మహిళలు పోలింగ్ బూత్‌కు పూజలు చేశారు. ఇవాళ మొదటి విడత పోలింగ్ జరుగుతుండగా... ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. 


మొదటి విడతలో కీలక అభ్యర్థుల భవిష్యత్‌ను ఓటర్లు తేల్చనున్నారు. తమ విలువైన ఓటుతో వారిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలో నిర్ణయిస్తున్నారు. అలాంటి లిస్ట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మూడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన తమిళిసై సౌందర్ రాజన్ తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో ఫైర్‌బ్రాండ్‌గా పేరు ఉన్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ అన్నమలై కూడా కోయంబత్తూర్‌ నుంచి బరిలో ఉన్నారు. దయనిధి మారన్‌ చెన్నై సెంట్రల్ నుంచి పరీక్ష ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలోని శివగంగ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కార్తీ చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్‌ కొడుకు నకుల్ నాథ్ మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నుంచి పోటీ చేస్తున్నారు.