Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?

Andhrapradesh News: ఏపీలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొనేలా కూటమి నేతలు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

Pm Modi Election Campaign In Ap: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ నేతలతో కలిసి ఉమ్మడిగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ నిర్వహిస్తూ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అటు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలిసి పాల్గొన్న సభలకు ఎక్కువ స్పందన వస్తుండడంతో ఉమ్మడిగా నిర్వహించే సభలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ (Pm Modi) 4 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తోన్న అనకాపల్లి, కడప లేదా రాజంపేట, రాజమహేంద్రవరం, మరో నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రధాని మోదీతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభలకు ముందే వీలైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడిగా ప్రచారం చేయాలని వీరు భావిస్తున్నారు. ఈ నెల 24న రాయలసీమలోని రాజంపేట, రైల్వేకోడూరు సభల్లో ఇరువురు నేతలు పాల్గొననున్నారు. అటు, ఈ నెల 19న ఆలూరు, రాయదుర్గం, 20న గూడురు, సత్యవేడు, సర్వేపల్లి 'ప్రజాగళం' సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు.

Continues below advertisement

అభ్యర్థులకు అప్పుడే బీఫామ్స్

మరోవైపు, టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు చంద్రబాబు ఈ నెల 21న బీఫామ్స్ అందజేయనున్నారు. గురువారం పార్టీ జోనల్ ఇంఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీఫామ్స్ ఇవ్వనున్నారు. అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత జోనల్ ఇంఛార్జీలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం బరిలో నిలిచే తమ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు.

టీడీపీ అభ్యర్థుల నామినేషన్

అటు, తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఏపీలో (Ap) 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణ 17 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలి రోజు ఆర్వో కేంద్రాల్లో పలువురు కీలక నేతలు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లు సమర్పించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకోగా అక్కడ సందడి నెలకొంది. ఏపీలోని ఒంగోలు లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఆయన.. కలెక్టర్ దినేష్ కుమార్ కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నెల 25న ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఆర్వోకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Also Read: Vijayawada News: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్ - కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Continues below advertisement