Diwali 2023: దీపావళి పండగ వేళ వేడుకలపై ఢిల్లీ సర్కారు మరోసారి ఆంక్షలు విధించింది. దేశ రాజధాని పరిధిలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై మళ్లీ నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు సోమవారం ప్రకటించింది. చలికాలంలో భారీగా పెరిగే కాలుష్య స్థాయిలను నియంత్రించే తగ్గించే కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మంత్రి గోపాల్ రాయ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఢిల్లీ నగరం అంతటా నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
గత ఐదారేళ్ల నుంచి డిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్లు మంత్రి రాయ్ తెలిపారు. అయితే దానిని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా పటాకులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గోపాల్ రాయ్ వెల్లడించారు. టపాకాయల లైసెన్సుల మంజూరును మానుకోవాలని నేషనల్ కాపిటల్ రీజియన్(NCR) పరిధిలోని రాష్ట్రాల అధికారులకు కూడా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మత విశ్వాసాలను పాటించాలని, పండగలను జరుపుకోవాలని గోపాల్ రాయ్ నొక్కి చెప్పారు. ప్రాణాలను రక్షించడానికి సమష్టి కృషి అవసరమని, ఢిల్లీ వాసులు దీపావళిని దీపాలతో జరుపుకోవాలని కోరారు. దీపావళి సమీపిస్తున్న తరుణంలో శీతాకాలల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలతో కాలుష్య హాట్ స్పాట్ ల పర్యవేక్షణను కూడా ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా ఎవరైనా పటాకులు పేల్చేతే ఆరు నెలల జైలు శిక్షణ, రూ.200 జరిమానా విధిస్తామని గత సంవత్సరం ఢిల్లీ సర్కారు ప్రకటించింది. ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు జరిపితే పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9బీ కింద రూ. 5 వేల జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్షణ పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
ఢిల్లీ.. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ
దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే.. ఢిల్లీ నగరంలో నివసించే పౌరుల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గుతుందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్.. ఢిల్లీ కాలుష్యంపై ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే ఢిల్లీ నగరంలో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. భారత దేశంలో 67.4 శాతం మంది ప్రజలు.. కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి జీవిత కాలం 5.3 ఏళ్లు తగ్గిపోతున్నట్లు షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.