Mowgli Real Story: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రియులకు "ది జంగిల్ బుక్ " తెలిసే ఉంటుంది. కార్టూన్ల రూపంలో సినిమా రూపంలో జంగిల్ బుక్ గురించి దానిలోని మోగ్లీ పాత్ర గురించి తెలియనివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. బ్రిటీష్ ఇండియాలో పనిచేసిన రూడ్యార్డ్ కిప్లింగ్ ఎప్పుడో 1894లో రాసిన ది జంగిల్ బుక్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటి. అయితే ఈ జంగిల్ బుక్‌లోని పాత్ర కల్పితం కాదు నిజ జీవిత పాత్ర అని చాలా మందికి తెలియదు. తోడేళ్లు పెంచిన మానవ బాలుడు దిన సనిచార్ (Dina Sanichar ) కథ తెలుసుకుందామా..!


బ్రిటిష్ వేటగాళ్లకు తోడేళ్ల గుహలో దొరికిన ఆరేళ్ల బాలుడు 
భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో అంటే 1867 ఫిబ్రవరిలో కొంతమంది వేటగాళ్లు ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ అడవిలో ఒక తోడేళ్ళ గుహలో ఆరేళ్ల బాలుడ్ని గుర్తించారు. కొన్ని తోడేళ్ల మధ్య తాను కూడా తోడేలు లాగానే ప్రవర్తిస్తున్న బాలుడ్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు తోడేలు వద్దకు ఎలా చేరుకున్నాడు అనే దానిపై అనేక ఊహగానాలు ఉన్నా ఏదీ నిర్ధారణ కాలేదు. చేతులు కాళ్లు నేల మీద ఉంచి తోడేలు లాగే నడుస్తున్న ఆ బాలుడ్ని అడవి నుంచి తీసుకుని వచ్చి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. 



అక్కడి కలెక్టర్ ఆ బాలుడిని అగ్రాలోని సికింద్రా అనాథ శరణాలయంలో చేర్పించారు. తోడేళ్ల మధ్య పెరగడం వల్ల ఆ బాలుడు మాట్లాడలేకపోయేవాడు. మొదట్లో తోడేలు లాగే నడిచినా కొంతకాలానికి రెండు కాళ్ళ మీద నడిచేవాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం కాదు. అదే అనాథ శరణాలయంలో 20 ఏళ్లకుపైగా గడిపాడు. ఆ అబ్బాయి శరణాలయంలో చేరిన శనివారం రోజు గుర్తుగా తనకు "దిన శనిచార్ " అనే పేరునే పెట్టేశారు. 



జీవితంలో ఒక్కసారి కూడా అబ్బాయి మాట్లాడింది లేదు. శరణాలయంలో మిగిలిన వాళ్ళతో మాత్రం బాగానే కలిసిపోయేవాడు. నోటి వెంట తోడేలు లాగా కొన్ని విచిత్రమైన శబ్దాలు మాత్రం చేసేవాడని రికార్డులు చెబుతున్నాయి. హెవీ స్మోకర్‌గా చుట్ట విపరీతంగా కాల్చే అలవాటు ఉన్న శనిచార్‌కు టీబీ వ్యాధి సోకింది. చివరకు ఆ వ్యాధితోనే తన 34 ఏళ్ల వయసులో 1895లో దిన శనిచార్ చనిపోయాడు. 



జంగిల్ బుక్‌లోని మోగ్లీ  (Mow -Glee ) పాత్రకు ఇన్స్పిరేషన్ దిన శానిచార్ నే 
తోడేళ్లు పెంచిన అబ్బాయిగా దిన శానిచార్‌కు వచ్చిన ప్రచారం చాలామందిలో ఆసక్తి కలిగించింది. అలాంటి వారిలో ఇండియాలోనే పుట్టిన బ్రిటిష్ జర్నలిస్ట్, రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ ( 1865-1936) ఒకరు. దిన శనిచార్ విచిత్ర కథను ఆధారంగా చేసుకుని ఆయన మోగ్లీ పాత్రను సృష్టించాడు. శానిచార్ లాగానే మోగ్లీని కూడా తోడేళ్లు పెంచుతాయి. వాటి జతకు బాలూ (ఎలుగుబంటి ), భగీరా (నల్ల చిరుత ), షేర్ ఖాన్ (పెద్ద పులి), కా (కొండ చిలువ ), ఇక్కి (ముళ్లపంది ). లూయి ( పెద్ద తోక లేని కోతి ) లాంటి పాత్రలను కలిపి ఆయన రాసిన పుస్తకమే ది జంగిల్ బుక్. 



శనిచార్ చనిపోవడానికి ఏడాది ముందు (1894)లో రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా 1895లో ది సెకండ్ జంగిల్ బుక్ కూడా రాశారు కిప్లింగ్. ఆ రెండు పుస్తకాలు కలిపి ఇప్పటికి చాలా సినిమాలు, సీరియళ్లు తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు వారి బాల్యంలో జంగిల్ బుక్ ఒక భాగం అయిపోయింది. అయితే పుస్తకంలోని మౌగ్లీ పాత్రకు ఆధారమైన దిన శనిచార్ గురించి చాలామందికి తెలియకపోవడం మాత్రం విచారం.


Also Read: తిరుమల ఘాట్ రోడ్ చరిత్ర మీకు తెలుసా?