Delhi Woman Jumps off Metro : దిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లోని 40 అడుగుల ఎత్తున్న ప్లాట్‌ఫారమ్‌పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ యువతిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గురువారం రక్షించారు. మెట్రో స్టేషన్‌లో ఉన్న భద్రతా సిబ్బంది గురువారం ఉదయం 7.30 గంటలకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 అంచుపై ఒక యువతి నిలబడి ఉందని ప్రయాణికులు అప్రమత్తం చేసినట్లు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, CISF ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆమెను మాట్లాడేందుకు ప్రయత్నించారు. యువతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో స్థానిక సివిల్ ఉద్యోగుల సహాయంతో మరొక బృందం స్టేషన్ కింద దుప్పటిని పట్టుకుని ఆమెను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారించినా వినకుండా యువతి దూసేసింది. దీంతో వెంటనే కింద ఉన్న సిబ్బంది స్పందించి ఆమెను రక్షించారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఐఎస్ఎఫ్ తన ట్విట్టర్ లో ఈ వీడియో పోస్టు చేసింది. 







పంజాబ్ కు చెందిన యువతి 


స్టేషన్ పై నుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి కానీ ప్రాణాలతో రక్షించగలిగామని సీఐఎస్ఎఫ్ తెలిపింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఆమె మూగ, చెవిటి అని సమాచారం. ఈ ఘటనలో ఆమె కాలు, చేతికి ఫ్రాక్చర్ అయింది. దిల్లీలోని LBS ఆసుపత్రిలో యువతికి చికిత్స అందిస్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌కు ఉగ్రవాద నిరోధక రక్షణ అందిస్తుంది.