High Court Judges Transfer : ఏపీ, తెలంగాణ హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజూజు ట్వీట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని, వారి పేర్లను ట్వీట్ చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవరాజు నాగార్జున్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. అలాగే వడమలై(జస్టిస్ ఆఫీసర్) ను మద్రాస్ హైకోర్టుకు అదనపు జడ్జిగా బదిలీ చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఏడాది ఏడుగురి బడ్జిల బదిలీ
గత ఏడాది నవంబర్ లో హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబరు 24న సుప్రీంకోర్టులో కొలీజియం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని వివిధ హైకోర్టుల్లోని జడ్జిలను బదిలీ చేయాలని నిర్ణయించారు. దేశంలో మొత్తం ఏడుగురు హైకోర్టు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులకు స్థానచలనం కలిగింది. ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలను వేర్వేరు ప్రాంతాలను బదిలీ చేశారు. తెలంగాణలో హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వీఎం వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు పంపారు. ఏపీ హైకోర్టులోనే ఉన్న జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న టి.రాజా రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు.
బదిలీలపై అభ్యంతరం
ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీపై న్యాయవాదులు అప్పట్లో ఆందోళన కూడా చేపట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ బదిలీ సరికాదని న్యాయవాదులు అప్పట్లో నిరసన తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బదిలీని వెనక్కి తీసుకున్నారని డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై లాయర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని లాయర్లు విమర్శించారు. తెలంగాణ న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ అప్పట్లో హైకోర్టు న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకించారు.