Delhi Air Pollution: 



సరిబేసి విధానం ఉపసంహరణ..


Delhi Pollution News: కాలుష్య నియంత్రణకు సరిబేసి వాహన విధానాన్ని (Delhi Odd Even System) అమలు చేయాలని భావించిన ఢిల్లీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నవంబర్ 13 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకున్నా...ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అకస్మాత్తుగా వర్షం కురవడం వల్ల గాలి నాణ్యత (Delhi Air Pollution) కొంత వరకూ మెరుగు పడింది. ఈ క్రమంలోనే సరిబేసి విధానంపై వెనక్కి తగ్గింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ఈ విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినప్పటికీ కోర్టు ప్రభుత్వానికే నిర్ణయాన్ని వదిలేసింది. సరిబేసి విధానం అమలు చేయడం వల్ల ఎంత వరకూ కాలుష్యం తగ్గే అవకాశముందో చెప్పాలని గత వారమే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఆ తరవాత కోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ క్రమంలోనే "తుది నిర్ణయం ప్రభుత్వానిదే" అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆలోచించిన ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. 






"ప్రస్తుతానికి ఢిల్లీలో కాలుష్యం ఇంకా ప్రమాదకరంగానే ఉంది. కానీ వర్షం పడడం వల్ల కొంత వరకూ వాతావరణ పరిస్థితులు మెరుగు పడ్డాయి. AQI 300 కన్నా తక్కువగా నమోదైంది. ఇప్పటి వరకూ ఇది 450పైగానే ఉంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు నవంబర్ 13-20 వరకూ సరిబేసి విధానం అమలు చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం"


- గోపాల్ రాయ్, పర్యావరణ మంత్రి


ఇన్నాళ్లూ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధానికి కాస్త ఊరట లభించింది. ఉన్నట్టుండి వర్షం కురవడం వల్ల గాలి నాణ్యత (Delhi Air Quality) కొంత వరకూ మెరుగు పడింది. AQI ఇంకా "Severe" కేటగిరీలోనే ఉన్నప్పటికీ మునుపటితో పోల్చుకుంటే ఉపశమనం దొరికింది. ఈ ఉదయం (నవంబర్ 10) 6 గంటల సమయానికి గాలి నాణ్యత అలాగే ఉందని, భారీ మార్పు ఏమీ కనిపించలేదని Central Pollution Control Board (CPCB) డేటా వెల్లడించింది. అశోక్‌ విహార్‌లో 462, ఆర్‌కే పురంలో 461గా గాలి నాణ్యత నమోదైంది. అయితే...కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కారణంగా గాలి నాణ్యత పెరిగిందని అధికారులు వెల్లడించారు. నోయిడాలో మాత్రం ఈ వర్ష ప్రభావం కనిపించడం లేదు. అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఫరియాబాద్‌, గుడ్‌గావ్‌, ఘజియాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఏదేమైనా ఇలా రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడితే పరిస్థితులు సాధారణానికి వస్తాయని స్థానికులు చెబుతున్నారు. 


Also Read: Delhi Pollution News: మేం జోక్యం చేసుకుంటే తప్ప మీలో చలనం రాదా? ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం