Supreme Court Slams Delhi Govt Again Over Pollution: 


సుప్రీంకోర్టులో పిటిషన్‌లు..


ఢిల్లీ కాలుష్యంపై (Pollution in Delhi) సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సమయంలో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండి పడింది. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని (Stubble Burning) కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటే తప్ప ఏ చలనమూ ఉండడం లేదని ఫైర్ అయింది. ప్రతి ఏడాది ఇదే జరుగుతోందని తెలిపింది. కాలుష్యంలో 24% మేర వాటా గడ్డి కాల్చడం వల్లేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. 


"ఏటా కాలుష్య సమస్య వెంటాడుతూనే ఉంది. అయినా సరే మేం జోక్యం చేసుకుంటే కానీ మీలో చలనం కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. మొత్తం కాలుష్యంలో దీనిదే 24% వాటా ఉంది. బొగ్గు, ఫ్లై యాష్ కారణంగా 17% మేర కాలుష్యం నమోదవుతోంది. వాహనాల ద్వారా 16% గాలి కలుషితమవుతోంది. ఇదంతా తెలియంది కాదు. అయినా సరే కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చేంత వరకూ ఏ చర్యలూ తీసుకోకుండా ఎదురు చూస్తున్నారుసరిబేసి విధానం అమలు చేయాలా వద్దా అన్నది కోర్టుకి వదిలేయకండి. ఆ భారాన్ని కోర్టుపై వేయకండి"


- సుప్రీంకోర్టు 






ఆరేళ్లుగా ఈ సమస్య ఏటా ఉత్పన్నమవుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. కట్టడి చర్యలు విఫలమైన తరవాత కోర్టుని ఆశ్రయించడం సరికాదని మందలించింది. గడ్డిని కాల్చుతున్న ఘటనల్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని ఆదేశించింది. 


"బహుశా ఢిల్లీ ప్రజల ప్రార్థనలు దేవుడు విన్నాడేమో. అందుకే వర్షం పడింది. కొంత వరకూ ఊరట లభించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. పంజాబ్‌లో రైతులు వరిగడ్డి కాల్చుతూనే ఉన్నారు. కానీ ఏ చర్యలూ తీసుకోవడం లేదు. రానురాను ఆ రాష్ట్రాన్ని ఎడారిగా చేసేస్తారా..? వరికి బదులుగా అక్కడి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రభుత్వం అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ట్యాక్సీలపై సరిబేసి విధానం అమలు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. దీని వల్ల ఏం ఉపయోగం"


- సుప్రీంకోర్టు


తాము మాట్లాడేది కేవలం పంజాబ్ ప్రభుత్వం గురించే కాదని, అన్ని రాష్ట్రాలు కాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వాల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. వరిసాగు చేసే ప్రాంతాల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరముందని తెలిపింది. 


Also Read: Delhi Pollution: ఢిల్లీలో ఉన్నట్టుండి వర్షం, కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలు