Delhi Pollution: 


ఢిల్లీ కాలుష్యం..


దాదాపు మూడు రోజులుగా ఢిల్లీ కాలుష్యం (Delhi Air Pollution) అక్కడి ప్రజల్ని సతమతం చేస్తోంది. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పైగా అధికారులు కాలు బయటపెట్టకండి అంటూ హెచ్చరిస్తున్నారు. అత్యవసరమై వచ్చినా ఆ కలుషిత గాలిని పీల్చలేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వైద్యులు మరింత హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో AQI 413కి పడిపోయిందని, ఈ గాలి (Delhi Air Quality) పీల్చితే అనేక రోగాలు చుట్టు ముడతాయని చెబుతున్నారు. సీనియర్ వైద్యుల మాటల్లో చెప్పాలంటే...25-30 సిగరెట్లు వరస పెట్టి తాగితే బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో...ఢిల్లీలో గాలి పీల్చితే శరీరం అంత పాడవుతుంది. అంతే కాదు. ప్రస్తుతం తల్లి కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఈ గాలితో ప్రమాదమే అంటున్నారు. ఆ చిన్నారులపై ఈ కాలుష్యం ఎంత ప్రభావం చూపిస్తుందో వివరిస్తున్నారు. 


"కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ ఈ కాలుష్యం వల్ల సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇంకా పుట్టని బిడ్డపైనా ప్రభావం పడుతుందంటే నమ్మడానికి కాస్త వింతగానే అనిపిస్తుండొచ్చు. కానీ అది నిజం. తల్లి ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ గాలి అంతా ఆమె ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా రక్తంలో కలుస్తుంది. అక్కడి నుంచి పిండానికి చేరుకుంటుంది. అంటే అది నేరుగా బిడ్డపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి గాలి పీల్చడం వల్ల నెలలు నిండక ముందే ప్రసవం అవుతుంది. ఆ చిన్నారులకూ అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆ తరవాత కూడా ఎన్నో సమస్యలు వస్తాయి"


- డా. అరవింద్ కుమార్, సీనియర్ లంగ్ స్పెషలిస్ట్






అప్పుడే పుట్టిన చిన్నారులకూ ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వైద్యులు. పుట్టీ పుట్టగానే ఇంత కలుషితమైన గాలిని పీల్చుకుంటే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


"అప్పుడే పుట్టిన చిన్నారి ఇంత కలుషితమైన గాలి పీల్చుకుంటే ఎంత ప్రమాదకరమో ఊహించవచ్చు. ఆ చిన్నారుల శరీర భాగాల్ని ఆ గాలి దారుణంగా డ్యామేజ్ చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది"


- డా. అరవింద్ కుమార్, సీనియర్ లంగ్ స్పెషలిస్ట్


ఈ కాలుష్యం కారణంగా ఉన్నట్టుండి ఎయిర్ ప్యూరిఫైర్స్, మాస్క్‌లకు డిమాండ్ పెరిగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మాస్క్‌లు కొనేందుకు వచ్చిన కస్టమర్స్‌తో మెడికల్ షాప్‌లు కిటకిటలాడుతున్నాయి. అటు ఎయిర్ ప్యూరిఫైర్స్‌ షాప్‌లపైనా ప్రజలు ఎగబడుతున్నారు. N95 మాస్క్‌లకూ డిమాండ్ అమాంతం పెరిగింది. కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు అంతా వీటిని ధరిస్తున్నారు. 


Also Read: ఎగ్జామ్‌ హాల్‌లోకి వెళ్తుండగా కుప్ప కూలిన 15 ఏళ్ల బాలిక, గుండెపోటుతో మృతి!