Mallikarjun Kharge: 



నితీశ్‌కి ఖర్గే ఫోన్ కాల్..? 


I.N.D.I.A కూటమిపై (I.N.D.I.A Alliance) ఇటీవలే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఈ కూటమిపై ఆసక్తి చూపించడం లేదని అన్నారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించినట్టు సమాచారం. నేరుగా నితీశ్‌కి కాల్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విపక్ష కూటమి తమ పార్టీకి ఎంతో కీలకమైందని స్పష్టం చేశారట. అయితే..ప్రస్తుతానికి కాంగ్రెస్ 5 రాష్ట్రాల ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు ఖర్గే వివరించారని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన తరవాతే I.N.D.I.A కూటమి అజెండాపై పూర్తిగా ఫోకస్ చేస్తామని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలంగాణపై ఎక్కువగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ  గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బలంగా నమ్ముతోంది. పైగా ఇటీవలే దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆ జోష్‌తోనే మరో సౌత్ స్టేట్ అయిన తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తోంది. అందుకే ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్ని పక్కన పెట్టింది. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికలపైనే కసరత్తు చేస్తున్నారు. అందుకే విపక్ష కూటమిలో యాక్టివ్‌గా కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఉద్దేశిస్తూనే నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. 


ప్రధాని అభ్యర్థిపై..


ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూటమిలో చీలికలు వస్తున్నాయంటూ ప్రచారం జరిగింది. ఇదే ప్రచారం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగితే నష్టం అనుకున్నారో ఏమో..ఖర్గే వెంటనే నితీశ్‌కి కాల్ చేశారట. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థి గురించీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ ఇప్పట్లో వెల్లడించదని స్పష్టం చేశారు. దీని వల్ల కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదముందని వెల్లడించారు. గెలిచిన తరవాతే ప్రధాని అభ్యర్థిపై క్లారిటీ ఇస్తామని వివరించారు. అన్ని పార్టీలూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన కీలక విషయం కనుక, అప్పుడే తొందరపడమని తెలిపారు. 


నితీశ్ ఏమన్నారంటే..? 


I.N.D.I.A కూటమి ఏర్పాటైంది కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదని, కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు నితీశ్. కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందని వెల్లడించారు. అందుకే కూటమి చడీచప్పుడు లేకుండా ఉండిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. పట్నాలోని ఓ ర్యాలీలో పాల్గొన్న నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా హఠావో, దేశ్ బచావో థీమ్‌తో జరిగిన ఆ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ఆ సమయంలో అక్కడ సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా లాంటి సీనియర్ నేతలున్నారు. Janata Dal (United) పార్టీ అన్ని పార్టీలనూ ఒక్కటి చేసే బాధ్యత తీసుకుందని తేల్చి చెప్పారు నితీశ్ కుమార్. దేశ ప్రజలు బేజీపీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అన్నారు. 


Also Read: ఢిల్లీలో మాస్క్‌లు ఎయిర్‌ ప్యూరిఫైర్‌లకు పెరిగిన డిమాండ్, గతేడాది కన్నా ఎక్కువ సేల్స్