Delhi Pollution: 



పెరుగుతున్న కాలుష్యం..


ఢిల్లీలో కాలుష్య (Delhi Air Pollution) తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. అధికారులు ఊహించినట్టుగానే వాయు నాణ్యత (Delhi Air Quality) దారుణంగా పడిపోతోంది. AQI ఇంకా "severe category"గానే ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం ఇవాళ (నవంబర్ 4) ఉదయం 7 గంటల నాటికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 413గా నమోదైంది. ఢిల్లీకి పొరుగునే ఉన్న NCRలోనూ ఇదే పరిస్థితి ఉంది. నోయిడా సెక్టార్‌లో AQI 426గా నమోదైంది. పరిస్థితులు మరింత దిగజారుతుండడం వల్ల అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రజారోగ్య విభాగం కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే చాలా మంది పౌరులు ఈ కాలుష్య ధాటికి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కళ్లు ఎరుపెక్కుతున్నాయి. గొంతు నొప్పి పుడుతోంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు నరకం చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఢిల్లీ కాలుష్యానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి కమ్ముకుంది. ముఖ్యంగా యమునా నదీ తీర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ కాలుష్య ధాటికి తట్టుకోలేక ఎవరూ మార్నింగ్ వాక్‌కి రావడం లేదు. అత్యవసరమై బయటకు వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముక్కు, నోరుని కవర్ చేసుకునేలా మాస్క్‌లు ధరిస్తున్నారు. 






మాస్క్‌లకు మస్తు డిమాండ్..


ఈ కాలుష్యం కారణంగా ఉన్నట్టుండి ఎయిర్ ప్యూరిఫైర్స్, మాస్క్‌లకు డిమాండ్ పెరిగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మాస్క్‌లు కొనేందుకు వచ్చిన కస్టమర్స్‌తో మెడికల్ షాప్‌లు కిటకిటలాడుతున్నాయి. అటు ఎయిర్ ప్యూరిఫైర్స్‌ షాప్‌లపైనా ప్రజలు ఎగబడుతున్నారు. N95 మాస్క్‌లకూ డిమాండ్ అమాంతం పెరిగింది. కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు అంతా వీటిని ధరిస్తున్నారు. 


"గత రెండ్రోజుల్లోనే ఎయిర్ ప్యూరిఫైర్స్‌కి 20-25% మేర డిమాండ్ పెరిగింది. ఈ కాలుష్య  ధాటికి తట్టుకోలేక చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోల్చి చూస్తే ఈ సారి సేల్స్ ఎక్కువయ్యాయి. మరి కొన్ని రోజులూ ఇలాగే పరిస్థితులు కొనసాగితే డిమాండ్ ఇంకా పెరిగే అవకాశముంది"


- వ్యాపారి