IOCL: చోర కళ.. 64 కళల్లో ఒకటి. మనం సాధారణంగా మన చుట్టుపక్కల, వార్తల్లో చోరీల గురించి వింటూనే ఉంటాం. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి బంగారం, డబ్బు, నగలు చోరీ చేసే వారు కొందరు. ఇంకొందరు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో చేతి వాటం ప్రదర్శించే వారు మరికొందరు. వీరు జేబుల్లో పర్సులు, మొబైల్ ఫోన్లు కాజేస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే మన జోబుకు చిల్లు పెట్టి వాడికి కావల్సినవి తీసుకుని వెళ్లిపోతుంటారు. ఈ మధ్య చైన్ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇంటి బయట పెట్టిన బైకులు, కార్లు చోరీకి గురవుతాయి. 


కొన్ని చోట్ల మేకలు, ఆవులు, గేదెలను రాత్రికి రాత్రి చోరీ చేసి తీసుకెళ్తుంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఘనులు ఏకంగా ఆర్టీసీ బస్సులనే చోరీ చేస్తున్నారు. ఎంచక్కా డ్రైవర్ సీట్లో కూర్చొని బస్సులను తీసుకెళ్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఓ దొంగ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సును చోరీ చేసుకుని తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక దానిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అలాగే తెలంగాణలో మరో దొంగ ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సును తస్కరించాడు. అందులో డీజిల్ అయిపోవడంతో మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.   


తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటన గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆయిల్ దొంగతనం కోసం ఓ దొంగ ఏకంగా టన్నెల్ తవ్వేశాడు. ఇండియన్ ఆయిల్‌కు చెందిన పైప్ లైన్‌కు కన్నం పెట్టి ఆయిల్ చోరీకి పాల్పడ్డాడు. పైప్ లైన్ ఉన్న ప్రాంతం నుంచి తన పొలంలోకి 40 మీటర్ల పొడవాటి సొరంగం తవ్వి, రెండు పొడవాటి ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి చమురును స్వాహా చేస్తున్నాడు. అయితే పైప్ లైన్‌లో చమురు తక్కువగా వస్తుండంతో అనుమానం వచ్చిన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. 


వివరాలు.. ఢిల్లీ సమీపంలోని పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. తన పొలానికి 40 మీటర్ల దూరంలో వెళ్తున్న ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. రెండు ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో ఏదో జరగుతోందని ఆయిల్ సంస్థ నిర్వాహకులకు అనుమానం వచ్చింది. దీనిపై అక్టోబర్ 4న ఐఓసీఎల్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 29న తాము తనిఖీ నిర్వహించామని, ఢిల్లీ-పానిపట్ సెక్షన్ తమ పైప్‌లైన్‌లో చమురు దొంగిలించబడుతోందని పేర్కొన్నారు. పోచంపూర్ గ్రామంలో దొంగతనం జరిగే అవకాశం ఉందని పోలీసులకు ఐఓసీఎల్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పైప్‌లైన్ డ్రిల్లింగ్ చేసిన సైట్ నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్న రాకేష్ స్థలంలో సొరంగం గుర్తించారు. అందులో రెండు ప్లాస్టిక్ పైపులను పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. పెట్రోలియం, మినరల్స్ పైప్‌లైన్స్ (భూమిలో వినియోగదారు హక్కును స్వాధీనం చేసుకోవడం) సవరణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం మరియు భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్‌ల కింద రాకేష్‌పై కేసు నమోదైంది. రాకేష్‌కు సహకరించిన మిగతా వ్యక్తుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.