రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వరుస పర్యటనలు చేస్తున్నారు. తరచూ రాజస్థాన్‌ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌, ధన్కర్ ను ప్రశ్నించారు. లక్ష్మణ్‌గఢ్‌లోని మోడీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రసంగించారు. రాజ్యాంగ పదవులను గౌరవించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కు సూచించారు. 


జ్యాంగ పదవుల పట్ల గౌరవం ఉండాలి
తనను మళ్లీ మళ్లీ ఎందుకు రాష్ట్రానికి వస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ పదవులపై  వ్యాఖ్యానిస్తారని అనుకోలేదన్నారు. రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం ఉండాలన్న ధన్కర్, మనందరం కలిసికట్టుగా, చేయిచేయి కలిపి ఏకాభిప్రాయంతో విధానాలు రూపొందించి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పదవుల్లో ఉన్నా దేశానికి సేవకులమని, ఇది మన దేశమన్నారు ఉపరాష్ట్రపతి ధన్కర్. రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఇది అందరికీ వర్తిస్తుందని వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి రానివ్వకూడదన్న ధన్కర్, కాస్త సున్నితత్వం ప్రదర్శించాలని సూచించారు. 


ఢిల్లీ-రాజస్థాన్ కు అప్ డౌన్ చేస్తున్నారన్న గెహ్లట్
 ఉప రాష్ట్రపతి ఢిల్లీకి, రాజస్థాన్‌కు అప్‌ అండ్‌ డౌన్ చేస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ అయినా, రాష్ట్రపతి అయినా తాము గౌరవిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇలా వరుస పర్యటనలు చేయడం సరికాదని సూచించారు. రాజకీయ నాయకులు రావొచ్చని, ఉప రాష్ట్రపతిని పంపించొద్దంటూ బీజేపీని ఉద్దేశించి చురకలు అంటించారు. అది రాజ్యాంగ పదవన్న ఆయన, తమకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులపై గౌరవం ఉందని తెలిపారు. ఉప రాష్ట్రపతి వచ్చి ఐదు జిల్లాల్లో పర్యటించడంలో, ఏమైనా లాజిక్‌ ఉందా ? ఇది ఎన్నికల సమయం అని గుర్తు చేశారు. 


రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి...
1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో జగ్‌దీప్‌ జన్మించారు. గోఖల్‌ చంద్‌, కేసరి దేవి తల్లిదండ్రులు. ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. రాజస్థాన్‌ ఝుంఝునూ జిల్లాకు చెందిన ఈయన గ్రామస్థాయి పాఠశాలలో, తర్వాత సైనిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో డిగ్రీచేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. అత్యంత తక్కువ సమయంలోనే రాజస్థాన్‌ హైకోర్టులో బలమైన న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.


ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన ధన్కర్


1989లో తొలిసారి ఝున్‌ఝునూ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1990-1991 మధ్య స్వల్పకాలం పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 93-98 మధ్య రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా పని చేశారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2019లో అనూహ్యంగా కేంద్రం ఆయన్ని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా నియమించింది. మమతా బెనర్జీకి అనేక విషయాల్లో చికాకు తెప్పించారు.