5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సీఈసీ రాజీవ్ కుమార్ సమీక్ష జరిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ధనబలాన్ని కట్టడి చేయండి
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పార్టీలు, అభ్యర్థులు పంపిణీ చేసే ధన బలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని అబ్జర్వర్లను నిర్దేశించారు రాజీవ్ కుమార్. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది.
ఇటీవల ఆన్ లైన్ నగదు బదిలీ అభ్యర్థులకు అనుకూలంగా మారిందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఆ విధంగా ప్రలోభ పెట్టినా కూడా తమకు తెలిసిపోతుందని, ఆన్ లైన్ లో నగదు బదిలీల వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకుంటున్నట్టు సీఈసీ తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చని, ఫొటోను యాప్ లో అప్‌లోడ్ చేస్తే 100 నిముషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేసి, ఫిర్యాదుదారుడికి సమాచారమిస్తారని రాజీవ్ కుమార్ తెలిపారు.
రెండు విడతల్లో చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 8 నుంచి 10 మధ్య ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్ నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు నిర్వహించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఉండటంతో, భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17నే ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో ముగియనున్నాయి.
తెలంగాణలో 20 నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా
గత ఎన్నికల్లో తెలంగాణలో 73.37 శాతం పోలింగు నమోదైంది. 29 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 60 శాతం కంటే తక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్ పెడుతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 35,356 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మహిళలకు 597 ప్రత్యేక కేంద్రాలు, దివ్యాంగులకు 120 కేటాయించారు. ఒక్కో సెగ్మెంట్ లో యువతకు ఒక పోలింగ్ కేంద్రం కేటాయించనుంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది.