ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కులగణన చేపడుతామంటూ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన మున్సిపల్, పంచాయతీరాజ్ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ధనికులదేనని.. పేదలు, మధ్య తరగతి ప్రజల సమస్యలు మాత్రం పట్టవని మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఛత్తీస్‌గఢ్‌ను హింసాకాండ నుంచి విముక్తి కల్పించామన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు 10లక్షల ఇళ్లు ఇస్తామన్నారు. మన పంచాయతీలు, పట్టణ సంస్థలు అభివృద్ధికి మూలస్తంభాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పంచాయితీ రాజ్‌ను అమలు చేయడం ద్వారా, ప్రజలకు అధికారాన్ని అప్పగించిందని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేయడం ద్వారా అద్భుతమైన అభివృద్ధి నమూనాను అందించిందని కొనియాడారు.
15 లక్షల వేస్తామన్న హామీ ఏమైంది
దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. కోట్లాది ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమయ్యాయన్న ఆమె, నరేంద్ర మోడీ సర్కార్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులు రోజుకు రూ.27 సంపాదిస్తున్నారని, అదానీ వంటి పారిశ్రామికవేత్తలు మాత్రం రోజుకు రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రజాధనాన్ని వ్యాపారవేత్తలైన తన మిత్రులకు అప్పగించారని విమర్శించారు. ఆ ధనాన్నే తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు.
మేనిఫెస్టో అంశంగా కులగణన
బిహార్ లో జరిగిన కులగణనతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది. రాజకీయంగా సామాజికంగా ఉపాధిపరంగా ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి అయితే చర్చ మరింత తీవ్రంగా జరుగుతోంది. దీన్ని రాజకీయ అవకాశంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. కులగణన అంశాన్ని రాహుల్ గాంధీ ప్రధానంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే కులగణన చేస్తామని హామీలిచ్చేస్తున్నారు. జనాభా ప్రకారంగా పదవుల్లో ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం రావాలంటూ రాహుల్ గాంధీ చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలపై కులగణన ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇది మేనిఫెస్టో అంశంగా కూడా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తుండటంతో కేంద్రంలోని అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది.
1931లో పూర్తి కులగణన
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది. మండల్ రిజర్వేషన్ల అమలు అనంతరం ఇది ఇంకా బలపడింది. అయితే దేశంలోని పాలకులు ఈ అంశాన్ని పక్కన పెట్టారు. సాధారణ జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే లెక్కిస్తున్నారు. వారితో పాటు ఓబీసీలను కూడా లెక్కించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండటం, అధికారంలోకి వస్తే చేస్తామని చెబుతుండటంతో, కులాల పేరుతో విభజిస్తున్నారంటూ బీజేపీ మండిపడుతోంది.