మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలు, వివిధ పార్టీలు, సామాన్యులు బండారు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తప్పుబట్టారు. రోజాకు మద్దతుగా తన ఎక్స్ ఖాతాలో వీడియోను రిలీజ్ చేశారు. ఒక మహిళపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. సత్యనారాయణ లాంటి రాజకీయ నాయకుడిని చూసి తాను సిగ్గుపడుతున్నట్లు రాధిక వెల్లడించారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాకు మద్దతు ప్రకటించారు.


రోజాకు క్షమాపణలు చెప్పాలి
ఒక మనిషిగా ముందుకు వచ్చి మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని రాధిక డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే రహస్యంగా దొంగలా బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో రోజాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అసలు ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు వచ్చినా, తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కలుగజేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. మీలా మేం తిరిగి మాట్లాడడానికి ఎంతో సమయం పట్టదని, మేం కూడా మీలాగే మాట్లాడాలని కోరుకుంటున్నారా ? పొద్దున్న మీరు లేచి పనికి వెళ్తున్నారు కదా ? అన్ని అన్నారు. రాజకీయాలు చేయడానికి, మీటింగ్‌లు పెట్టడానికి వెళ్తున్నారు,  మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ? మీ వెనుక ఏం జరుగుతుందో మీకు తెలుసా ? అందరూ మీ స్థాయికి దిగజారిపోయేలా చేయకండని హెచ్చరించారు. 


 


రోజాకు సంపూర్ణ మద్దతు
"గౌరవనీయురాలైన మంత్రి, నటి, మంచి స్నేహితురాలు రోజాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఒక స్నేహితురాలిగా, సహ నటిగా, ఎంతో ధైర్యవంతురాలివి. రోజా గురించి తెలిసిన వ్యక్తిగా నేను మద్దతు ప్రకటిస్తున్నా. గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, చవకబారు రాజకీయాలు ఎంతగానో బాధించాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను పార్లమెంట్ ఆమోదించింది. ఇవాళ ఇండియా ప్రగతిశీల దేశంగా ఎదుగుతోంది. ఒక గొప్పదేశాన్ని నిర్మించడానికి మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆడ, మగా అనే తేడా లేకుండా ఈ దేశాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఒక మహిళను కించపరుస్తూ, నిరుత్సాహ పరుస్తూ బండారు సత్యనారాయణ నుంచి చవకబారు కామెంట్లు వినాల్సి వచ్చింది " అని వీడియోలో వ్యాఖ్యానించారు. 


బండారు వ్యాఖ్యలను ఖండిస్తున్నా : ఖుష్బూ
మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ. రోజాకు పూర్తి మద్దతు ఉంటుందన్న ఆమె, బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పే వరకు పోరాడుతానని వెల్లడించారు. రాజకీయ నాయకుడిగానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యారని విమర్శించారు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భంగా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అన్నారు. మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారని మండిపడ్డారు.