Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చింది. 2021-22లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సమావేశం జరిగిందని.. దీనికి ఎంపీ రాఘవ్ చద్దా, పంజాబ్ ప్రభుత్వ ఏసీఎస్ ఫైనాన్స్, ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం, ఎఫ్‌సీటీ పంజాబ్ ఎక్సైజ్ అధికారులు విజయ్ నాయర్ కూడా హాజరయ్యారని ఈడీ దర్యాప్తులో సిసోడియా సెక్రెటరీ సీ అరవింద్ వెల్లడించారు. సీఎం అరవింద్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ ఇప్పుడు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చార్జిషీట్ లో చేర్చింది. 






అయితే ఈ కేసులో చాద్దాను నిందితుడిగా ఈడీ పేర్కొనలేదు. ఇదే విషయాన్ని ఎంపీ రాఘవ్ చద్దా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఏ ఫిర్యాదులోనూ తనను నిందితుడిగా గానీ అనుమానితుడిగా గానీ పేర్కనలేదని తెలిపారు. పేర్కొన్న ఫిర్యాదుల్లో కూడా తనపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. 






గతంలో సీబీఐ కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అక్కడి సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరును ఆ సప్లిమెంటరీ చార్జిషీట్ లో చేర్చింది. ఆ తర్వాత మార్చి 9వ తేదీన సిసోడియాను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 


పదిహేను రోజుల క్రితమే సీఎంను విచారించిన సీబీఐ అధికారులు


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్ పై సీబీఐ అధికారులు 9 గంటలపాటు కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ అనంతరం రాత్రి ఎనిమిదన్నర గంటల ప్రాంతంలో సీబీఐ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి కారులో బయలురేరారు. ఉదయం నుంచి ఆప్ నేతలు, కార్యకర్తలు సీబీఐ ఆఫీసు ఏరియాకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు కొందరు నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. కాగా, సీబీఐ విచారణ ముగిసిన తరువాత రాత్రి 8.30 గంటలకు సీబీఐ ఆఫీసు నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఢిల్లీ సీఎం తన నివాసానికి బయలుదేరగానే ఆప్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.