Telangana Bhavan: దిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం(తెలంగాణ భవన్)ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. గతేడాది వసంత్ విహార్‌లో BRS ఆఫీస్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన మంత్రులు, ఎంపీల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉన్న తొలి పార్టీ తమదేనని BRS చెబుతోంది. అంతే కాదు. దేశ రాజధానిలో 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవానాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఉన్నట్టుగానే... ఢిల్లీలోనూ అదే తరహాలో తెలంగాణ భవన్‌ను కట్టారు. అయితే దీనికి ఇంకా సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌ను నాలుగు అంతస్తులుగా నిర్మించనున్నారు. కాన్ఫరెన్స్ హాల్‌, లైబ్రరీ, ఆడియో విజువల్ థియేటర్‌ ఏర్పాటు చేయనున్నారు.


తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ఈ తెలంగాణ భవన్‌ను వినియోగించుకోవాలని చూస్తోంది పార్టీ. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దిల్లీకి పయనమయ్యారు. అక్కడే ఉండి నిర్మాణ పనులను పరిశీలించారు. దిల్లీలో తెలంగాణ పదం పలకాడానికి, వినడానికి అవకాశాలు లేని పరిస్థితుల నుంచి అక్కడ బీఆర్ఎస్ సొంత కార్యాలయాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.