'యాద్గిరి & సన్స్' (Yadgiri & Sons Movie)... మే 5న (ఈ శుక్రవారం) విడుదలకు సిద్ధమైన సినిమా. దీనిని శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ పందిరి నిర్మించారు. అనిరుధ్, యశస్విని జంటగా నటించారు. బిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె. చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. 


'యాద్గిరి & సన్స్' కథేంటి?
యాద్గిరికి, ఆయన కుమారుడికి మందు తాగడమే పని. రెండో కుమారుడు ఎప్పుడూ ఇదే పనా? అని ప్రశ్నిస్తాడు. అతనికి ఓ ప్రేమ కథ కూడా ఉంది. అయితే, ఓ రోజు యాద్గిరి పెద్ద కుమారుడు మరణిస్తాడు. ఎవరో హత్య చేస్తారు. అతడిని చంపింది ఎవరు? ఆ మరణానికి కారణం ఎవరు? అన్నయ్య చావుకు తానే కారణం అని హీరో ఎందుకు బాధ పడుతున్నాడు? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.   


సాగర్ కె చంద్ర మాట్లాడుతూ ''ట్రైలర్ చూశా. చాలా కొత్తగా ఉంది. దర్శకుడిని అడిగి కథ తెలుసుకున్నాను. కథ ఏంటి? అనేది చెప్పలేను. కానీ, రియల్ ఇన్సిడెంట్స్‌ బేస్ చేసుకుని ఇటువంటి సినిమా చేయడం గ్రేట్. ఇది ఒక మంచి అటెంప్ట్. భిక్షపతి రాజుగారు కంటెంట్ బేస్డ్ సినిమా చేశారని నమ్ముతున్నా. మనం ఇటువంటి చిత్రాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అందరిపై ఉంది. ప్రచార చిత్రాల్లో అనిరుధ్, రోహిత్ చాలా బాగా చేశారు. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల గారికి నేను ఫ్యాన్‌‌. ఆయన సినిమా గురించి మంచి మాటలు చెప్పారు. దాంతో నాకు మరింత నమ్మకం కలిగింది. ఈ సినిమాతో అందరికీ పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. 


Also Read : ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి - పోసాని కౌంటర్


చిత్రదర్శకుడు భిక్షపతి రాజు మాట్లాడుతూ ''మమ్మల్ని ఆశీర్వదించిన సాగర్ కె.  చంద్ర గారికి థాంక్స్. మంచి సినిమా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాను. మే 5న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. సినిమా చూసి నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. సక్సెస్ చేయండి'' అని చెప్పారు. 


Also Read : అఖిల్‌ను మళ్ళీ రీ లాంచ్ చేయాల్సిందేనా... ఆర్‌సీబీ కప్పు, అఖిల్ హిట్ కొట్టడం కలేనా? - ఇంత దారుణమైన ట్రోల్స్ చూసి ఉండరు!



హీరో అనిరుధ్ మాట్లాడుతూ ''వెండితెరకు నేను పరిచయం అవుతున్న సినిమా ఇది. మా దర్శకుడికి థాంక్స్. ఆయన ఎంతో మోరల్ సపోర్ట్ అందించారు. వాస్తవ ఘటనలతో రూపొందిన ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి.  మంచి సినిమా చూశామనే ఫీలింగ్ థియేటర్ల నుంచి బయటకు వెళ్లే ప్రేక్షకులకు కలుగుతుంది'' అని చెప్పారు. ప్రతినాయకుడిగా నటించిన రోహిత్ మాట్లాడుతూ ''ఈ సినిమాలో చూపించినటువంటి ప్రమాదం ప్రతి ఇంట్లో జరిగే అవకాశం ఉంది. మనం ధైర్యంగా అటువంటి వాటిని ఎలా ఎదుర్కోగలమని చెప్పే చిత్రమిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి'' అని చెప్పారు. అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : శ్రీను బొడ్డు, సంగీతం: విజయ్ కురాకుల.