Nandi Awards Controversy : నంది పురస్కారాలపై రాజకీయ రంగు పడింది. ఇది ఏమీ కొత్తది కాదు, కానీ కొత్తగా మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా తెలుగు చలన చిత్రసీమ ప్రముఖులు చేసే వ్యాఖ్యలను పరిశ్రమలో కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారని చెప్పడం సబబు ఏమో! అసలు ఏమైంది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారేమో!?
ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కృష్ణ సూపర్ హిట్ 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ విషయాన్ని తెలిపారు. ఆ సమావేశంలో విలేకరులు నంది పురస్కారాల గురించి ప్రశ్నించారు. ఆ కార్యక్రమానికి హాజరైన అశ్వినీదత్, ప్రస్తుతం ఏపీలో ఉన్న అధికార వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా చురకలు వేశారు.
''ఇప్పుడు నడుస్తున్న సీజన్ వేరు కదా! ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ... వాళ్ళకు ఇస్తారు. సినిమాకు ఇచ్చే రోజులు మరో రెండు, మూడు ఏళ్లలో వస్తాయి'' అని వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని, అప్పుడు సినిమాలకు అవార్డులు ఇస్తారని ఆయన ఉద్దేశం! ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి స్పందించారు.
ఉత్తమ వెన్నుపోటు దారుడు అవార్డు ఇవ్వాలి కదా!
ఎప్పటి నుంచో ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పోసాని కృష్ణమురళి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. చిత్రసీమలో ప్రముఖులు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన గళం వినిపిస్తూ వస్తున్నారు. అశ్వనీదత్ వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఆయన విరుచుకుపడ్డారు.
''అశ్వనీదత్ అన్న పొరపాటున ఒక్క మాట మర్చిపోయాడు... గతంలో ఒకసారి నాతో ఆయన ఏమన్నారంటే? ఉత్తమ వెన్నుపోటు దారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డాఫర్ వంటి అవార్డులు ఇవ్వాలని చెప్పారు. అసలు, జగన్ ప్రభుత్వం అవార్డులు ఇస్తే కదా! ఒకవేళ ఆయన నంది అవార్డులు ఇస్తే... జగన్ మనుషులకు అవార్డులు ఇచ్చుకున్నారని చెప్పవచ్చు. తప్పు లేదు. కానీ, మాటలు ఇంకో రకంగా చెప్పారు. అంతకు ముందు పైన చెప్పిన అవార్డులు ఇచ్చారు. ఉత్తమ గురికాడు... నారా చంద్రబాబు నాయుడు మనిషి చెప్పు తీసుకుని గురి చూసి ఎన్టీ రామారావును కొట్టాడు కదా, అతనికి అవార్డులు ఇచ్చారు'' అని పోసాని కృష్ణమురళి ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోసాని వ్యాఖ్యల్లో కొన్ని రాయలేని పదాలు కూడా దొర్లాయి. చిత్ర పరిశ్రమ మనిషిగా కాకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా మాట్లాడారని ఏపీలో ప్రజలు కొందరు భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో తాను 37 ఏళ్లుగా ఉన్నానని, ఆయన బతుకు ఏంటో తనకు తెలుసనీ వ్యాఖ్యానించారు. తన బతుకు అయినా సరే తెలుసు అని పేర్కొన్నారు. నంది అవార్డుల మీద అశ్వనీదత్ సెటైర్లు వేయడం కరెక్ట్ కాదని, ఎప్పుడైనా ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
ఏ ప్రభుత్వం వచ్చినా తమకు కావాల్సిన వాళ్ళకు అవార్డులు ఇస్తున్నారని విమర్శ ఉందని, అసలు జగన్ ప్రభుత్వం నంది అవార్డులే ఇవ్వలేదని పోసాని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వచ్చిందని, ప్రజల ప్రాణాలు కాపాడటంపై ఆయన దృష్టి పెట్టారని, అప్పుడు నంది అవార్డుల కంటే అదే ముఖ్యమని పోసాని వివరించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నంది అవార్డుల మీద గతంలో ఆయన విమర్శలు చేశారు. తనకు 'టెంపర్'కు అవార్డు ఇవ్వగా కమ్మ కుల అవార్డుగా అనిపించి తీసుకోలేదని చెప్పారు.
Also Read : 'రెయిన్ బో' సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు - ఎంత ఎదిగిపోయావమ్మా!