Karnataka election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పటికే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయగా ఎన్నికలకు వారం ముందు కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  సిద్ధరామయ్య, డీకే శివకుమార్, డాక్టర్ పరమేశ్వరాజీ సహా ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. 



కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. హస్తం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 5 హామీలను (గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి) ఇచ్చింది. బెంగళూరులోని హోటల్ సాంగ్రిలాలో జరిగిన మ్యానిఫెస్టో ఆవిష్కరణలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరాజీ, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.

 

ఈ మేనిఫెస్టో కేవలం వాగ్దానం మాత్రమే కాదని, కర్ణాటక ప్రజలకు మంచి భవిష్యత్తు, సత్వర అభివృద్ధి కోసం తమ నిబద్ధత అని కాంగ్రెస్ చెబుతోంది.

 

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు

 

- నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులకు ప్రతి నెలా 5 వేలు

- భారత్ జోడో కోసం సామాజిక సామరస్య కమిటీ ఏర్పాటు

- అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.11,500 నుంచి రూ.15,000కు పెంపు

- అవినీతిపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టం

- 2006 నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీమ్ అమలు

- బీజేపీ చేసిన ప్రజావ్యతిరేక చట్టాలన్నీ ఏడాదిలోగా ఉపసంహరణ

- రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ

- రైతులపై పెట్టిన కేసులు వెనక్కి  

- వచ్చే 5 ఏళ్లలో రైతు సంక్షేమానికి రూ.1.5 లక్షల కోట్లు 

-రూ.3 లక్షల నుంచి రూ10 లక్షల వరకు రైతులకు 3 శాతం వడ్డీకి రుణాలు 

- గ్రామీణ రైతులకు రోజుకు కనీసం 8 గంటల పాటు విద్యుత్

- పంట నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5 వేల కోట్లు  (ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు)

- పాలపై సబ్సిడీ రూ.5 నుంచి 7కు పెంపు

- కొబ్బరి, ఇతర రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపు

- బజరంగ్ దళ్, PFI వంటి సంస్థలపై నిషేధంతో పాటు చట్ట ప్రకారం చర్యలు

- శక్తి యోజన ద్వారా సాధారణ KSRTC/BMTC బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం

- గృహ జ్యోతి యోజన ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్

- అన్నభాగ్య యోజన కింద 10 కిలోల బియ్యం

- గృహ లక్ష్మి యోజన ద్వారా కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ 2,000

- యువనిధి యోజన ద్వారా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1,500.

- SC/ST, OBC, మైనారిటీలు/లింగాయత్‌లు, వొక్కలిగాలకు రిజర్వేషన్లను 50% నుంచి 75%కి పెంపు

- కాశ్మీరీ పండిట్‌లకు సహాయం చేయడానికి కాశ్మీరీ సంస్కృతి కేంద్రాన్ని ప్రారంభించడానికి రూ.15 కోట్లు, వార్షిక గ్రాంట్ రూ.కోటి

-  మైనార్టీ మహిళలకు వ్యాపారం ప్రారంభించడానికి వడ్డీ రహిత రుణం రూ.3 లక్షలు

- ఆవు పేడ కిలో రూ.3కి కొనుగోలు

భజరంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐలపై నిషేధం

తాము అధికారంలోకి భజరంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. కుల, మత ప్రాతిపదికన వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై బలమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

తీవ్రంగా స్పందించిన బీజేపీ

కాంగ్రెస్‌ ప్రకటనపై అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ తీవ్రంగా స్పందించారు. పీఎఫ్‌ఐపై ఇప్పటికే నిషేధం ఉందని గుర్తు చేసిన ఆయన.. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పీఎఫ్‌ఐ కేసులను ఉపసంహరించుకుంది కాబట్టే ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో PFI, రాడికల్ ముస్లిం సంస్థల మేనిఫెస్టోను పోలి ఉందని హేమంత బిస్వా మండిపడ్డారు.