BSP Leader Afzal Ansari Disqualified As Lok Sabha MP: ఇటీవల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన కొన్ని రోజుల్లోనే మరో ఎంపీపై అనర్హత వేటు పడింది. బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై లోక్‌సభ సెక్రటేరియేట్ అనర్హత వేటు వేసింది. గ్యాంగ్ స్టర్ పాలిటీషియన్ అయిన ముఖ్తార్ అన్సారీకి అన్ననే ఈ అఫ్జల్ అన్సారీ. అయితే కిడ్నాప్, హత్య కేసుల్లో 4 ఏళ్లు శిక్షపడిన కారణంగా ఎంపీ అఫ్జల్ అన్సారీపై అనర్హత వేటు వేస్తూ లోకసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓ కేసులో అఫ్జల్ అన్సారీకి శిక్ష పడటం ఇదే తొలిసారి అని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు అఫ్జల్ అన్సారీ. అయితే క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం బీఎస్పీ నేతను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ సోమవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 29, 2023 నుంచి ఎంపీ పదవికి అనర్హత వేటు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం అఫ్జల్ అన్సారీని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించారు.
కాగా, గత వారం ఆయన సోదరుడు ముఖ్తార్ అన్సారీని గ్యాంగ్ స్టర్ నిరోధక చట్టం కింద 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. 2007లో వీరిపై నమోదైన కేసులో అఫ్జల్, ముఖ్తార్ లను యూపీలోని ప్రజా ప్రతినిధుల కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. మొదట ముఖ్తార్ పై కేసు నమోదుకాగా, అనంతరం అఫ్జల్ పై సైతం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో వీరిని దోషులుగా తేల్చుతూ.. ముక్తార్ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది కోర్టు. బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
విశ్వహిందూ పరిషత్ నాయకుడు నందకిశోర్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆపై 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య విషయంలోనూ ముఖ్తార్ పై 2007లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అభియోగాలతో ఎంపీ అప్జల్ అన్సారీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తాజాగా యూపీ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది.
ఎవరీ అఫ్జల్ అన్సారీ ?
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అఫ్జల్ అన్సారీ ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, రెండు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఘాజీపూర్ జిల్లాకు చెందిన అఫ్జల్ 1985 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తన స్వస్థలమైన మొహమ్మదాబాద్ నుండి సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అభయ్ నారాయణ్ రాయ్‌పై విజయం సాధించారు. ఆపై 1989, 1991, 1993 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేత విజయ్ శంకర్ రాయ్ పై మూడుసార్లు విజయం సాధించారు. అనంతరం తన ఐదవ అసెంబ్లీ ఎన్నికల్లో 1996లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 19,602 ఓట్లతో BSP అభ్యర్థి వీరేంద్రపై గెలుపొందారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కృష్ణానంద్ రాయ్ చేతిలో ఓటమిపాలయ్యారు. మూడేళ్ల తరువాత కృష్ణానంద్ రాయ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులోనే ముఖ్తార్, అఫ్జల్ దోషులగా తేలారు. 2019లో ఈ కేసులో అఫ్జల్, అతని సోదరుడు ముఖ్తార్‌తో పాటు మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో అఫ్జల్ పేరు చేర్చినప్పుడు ఆయన ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
2009లో అఫ్జల్ బీఎస్పీ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్థి రాధే మోహన్ సింగ్ చేతిలో ఓటమిచెందారు. 2010లో అఫ్జల్ తన సొంత రాజకీయ సంస్థ క్వామీ ఏక్తా దళ్ స్థాపించారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేత భరత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసి ఘాజీపూర్ నుంచి గెలుపొందారు.