BJP Manifesto For Karnataka Elections 2023: కర్ణాటక రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్షాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు. తాము గెలిస్తే అది చేస్తామని, ఇది చేస్తామని, అవి ఉచితంగా అందిస్తాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మధ్యే వివాదానికి దారి తీసిన నందిని పాల బ్రాండ్ ను బీజేపీ రాజకీయంగా వాడుకుంది. మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే ప్రతి రోజూ అర లీటరు నందిని పాలను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిరుపేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంతో పాటు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు.
ప్రజా ప్రణాళిక పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం మేడే సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత బీఎస్ యడియూరప్పలతో కలిసి జేపీ నడ్డా మేనిఫెస్టో ప్రకటించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల కలబోతగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు.
బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు ఇవీ..
* దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి రోజూ అర లీటరు నందిని పాలు ఉచితం
* పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణధాన్యాలతో నెలవారీ రేషన్
* దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం (ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున)
* తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన
* కర్ణాటక ఉమ్మడి పౌరస్పృతి అమలు చేస్తాం.
* ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు
* నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు
* వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్ లు
* కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ
* మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరు
* బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్
* ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం
* రూ.30 వేల కోట్ల మైక్రో కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కల్పన
* రూ.1500 కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధి
* ప్రముఖులతో కలిసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విశ్వేశ్వరయ్య విద్యా యోజన
* ప్రతిభావంతులైన యువ నిపుణుల కోసం సమన్వయ పథకం ద్వారా నైపుణ్యాల కల్పన
* ప్రభుత్వ పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు, యువతకు ఉచితంగా కోచింగ్
* మిషన్ స్వాస్థ్య కర్ణాటక ద్వారా రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పన
* మున్సిపల్ కార్పొరేషన్ లలోని ప్రతి వార్డులో రోగనిర్ధారణ సౌకర్యాలతో 'నమ్మ క్లినిక్'
* ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, 1000 స్టార్టప్ లకు మద్దతు, బీఎంటీఎస్ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం
* బెంగళూరు శివారులో ఈవీ సిటీ నిర్మాణం