Supreme Court Verdict on Divorce: విడాకుల విషయంలో సుప్రీంకోర్టు నేడు (మే 1) సంచలనమైన తీర్పు ఇచ్చింది. వివాహ బంధాన్ని కొనసాగించడం అసాధ్యమైన సందర్భంలో వెంటనే విడాకులు ఇవ్వవచ్చని తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్న సందర్భంలో ఆరు నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం భార్యాభర్తలు (Wife and Husband) ఇద్దరూ విడాకులు కోరుకుంటున్నా కూడా వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత మాత్రమే వాటిని మంజూరు చేసే అవకాశం కోర్టులకు ఉంది.


ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మాట్లాడుతూ.. ‘‘భార్యా భర్తల మధ్య రిలేషన్‌ను పునరుద్ధరించడం సాధ్యం కాకపోతే, పూర్తి న్యాయం కోసం ఆర్టికల్ 142 కింద ఇచ్చిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కోర్టు విడాకులపై నిర్ణయం తీసుకోవచ్చు. న్యాయస్థానం యొక్క ఈ నిర్ణయం ముఖ్యమైనదిగా పరిగణించాలి’’ అని ధర్మాసనం వెల్లడించింది.


తీర్పులో అన్ని మార్గదర్శకాలు


పరస్పర అంగీకారంతో విడాకులపై తీర్పు ఇస్తూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలను (Supreme Court Guidelines) కూడా జారీ చేసింది. భార్యాభర్తల సంబంధాలను కొనసాగించడం సాధ్యం కాకపోతే, పూర్తి న్యాయం కోసం ఆర్టికల్ 142 కింద ఇచ్చిన హక్కుల ద్వారా కోర్టు జోక్యం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఇది మాత్రమే కాదు, పరస్పర అంగీకారంతో విడాకులకు (Divorce) వర్తించే చట్టపరమైన గడువు కూడా 6 నెలల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలలో భరణం సహా ఇతర నిబంధనలను కూడా ప్రస్తావించారు.


“భార్యాభర్తల మధ్య వైవాహిక బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నం కావడం (సంబంధం పునరుద్ధరించడం సాధ్యం కాని స్థాయిలో క్షీణించినప్పుడు) కారణంగా వివాహాన్ని రద్దు చేయడం సాధ్యమవుతుందని మేం నిర్ధారించాం. ఇక్కడ ఎలాంటి నిర్దిష్ట లేదా ప్రాథమిక సూత్రాలు ఉల్లంఘించబడవు. ఇది మాత్రమే కాదు, కోర్టు మార్గదర్శకాల్లో కారకాలను కూడా పేర్కొంటోంది. దీని ఆధారంగా వివాహం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైందని పరిగణించవచ్చు. ఇలాంటి సందర్భంలో కొన్ని షరతులతో ఆరు నెలల నిరీక్షణ గడువును ఎత్తివేయవచ్చు’’ అని జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.


ఏళ్ల తరబడి విచారణ, నేడు తీర్పు


ఫ్యామిలీ కోర్టులకు (Family Courts) రిఫర్‌ చేయకుండానే సుప్రీంకోర్టు (Supreme Court Verdict on Divorce) నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై గతంలో కొన్ని పిటిషన్లు చాలా ఏళ్ల క్రితమే దాఖలు అయ్యాయి. పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను ఉపయోగించుకొనే వీలుందా అనే  దానిపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. అలా 2016 జూన్‌ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు సాగిన విచారణ అనంతరం, గత ఏడాది సెప్టెంబరులో ధర్మాసనం విచారణను ముగించింది. అదే నెలలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా నేడు (మే 1) తీర్పు చెప్పింది.