New Rules From 01 May 2023: ప్రతి నెల మొదటి రోజు నుంచి మన దేశంలో కొన్ని నిబంధనలు మారుతూ ఉంటాయి. అలాగే, ఈ నెల 1వ తేదీ నుంచి కూడా కొన్ని రూల్స్‌ మారాయి. ఇవన్నీ నేరుగా ప్రజల జేబుల మీద ప్రభావం చూపే మార్పులు. 

మే నెల 1వ తేదీ నుంచి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) ATM ఛార్జీల నుంచి GST నియమాలు, మెట్రోలో డిస్కౌంట్‌ వరకు 6 ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య LPG సిలిండర్ల ధరలు చౌకగా మారాయి. దీని ధర దాదాపు రూ. 172 తగ్గింది.

1. తగ్గిన వాణిజ్య LPG సిలిండర్‌ ధరమే 1వ తేదీ నుంచి వాణిజ్య LPG సిలిండర్ల (Commercial LPG Cylinder) ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌ రేటు దిల్లీ నుంచి చెన్నై వరకు దేశవ్యాప్తంగా ఒక్కసారే రూ. 171.50 తగ్గింది. కొత్త రేట్లను గ్యాస్ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశాయి.  రేటు తగ్గింపు తర్వాత... దిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 1,856.50కు అందుబాటులో ఉంది. ముంబైలో ధర రూ. 1,808.50, కోల్‌కతాలో ధర రూ. 1,960.50, చెన్నైలో రేటు రూ. 2.021.50 గా ఉంది. వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను ఉపయోగించే వ్యాపారస్తులకు ఇది ఊరట. కోట్లాది మంది సామాన్యులు ప్రతిరోజూ ఉపయోగించే గృహావసరాల గ్యాస్ (domestic gas cylinder price), పెట్రోల్ & డీజిల్ ధరల నుంచి మాత్రం ఉపశమనం లభించలేదు. 

2. తగ్గిన విమాన ఇంధనం ధరఈ నెలలో, ATF అంటే విమాన ఇంధనం (Aviation Turbine Fuel) ధర భారీగా దిగి వచ్చింది. దిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 2,414.25 తగ్గింది. ఇక్కడ కొత్త ధర కిలో లీటరుకు రూ. 95,935.34 గా ఉంది. 

3. మారిన GST ఇన్‌వాయిస్‌ అప్‌లోడ్‌ నిబంధనరూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్త, తన GST (Goods and Services Tax) లావాదేవీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను, వాటిని జారీ చేసిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో (IRP) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇన్‌వాయిస్‌ అప్‌లోడ్‌లో ఆలస్యం చేసినవాళ్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) కూడా పొందలేరు. ప్రస్తుతం, వ్యాపారులు అటువంటి ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా IRPలో అప్‌లోడ్ చేస్తున్నారు. 

4. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ATM ఛార్జీమీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉంటే, ఇవాళ్టి నుంచి మీరు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఈ నిబంధన ప్రకారం, ఖాతాలో తగినంత డబ్బు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించి విఫలమైతే, ఒక్కో లావాదేవీకి ఖాతాదారు రూ. 10 జరిమానా + జీఎస్టీ ఛార్జీని ‍‌(PNB ATM Charges) చెల్లించాల్సి ఉంటుంది.

5. మ్యూచువల్ ఫండ్స్‌లో KYC తప్పనిసరిసెబీ నిర్దేశం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ కంపెనీల ద్వారా, పెట్టుబడిదార్లు KYCతో కూడిన ఈ-వాలెట్ల ద్వారా మాత్రమే మ్యూచువల్ ఫండ్లలో ‍‌పెట్టుబడి (Mutual Fund Investment) పెట్టాలి. ఈ రోజు నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

6. ముంబై మెట్రో ఛార్జీలపై 25% తగ్గింపుముంబై మెట్రోలో ప్రయాణం చేసే కొంతమంది ఇది శుభవార్త. ఈ రోజు నుంచి, ముంబై మెట్రో రైళ్లలో ప్రయాణించే 65 ఏళ్లు పైబడిన పౌరులు, వికలాంగులు, 12వ తరగతి వరకు విద్యార్థులకు ఛార్జీలో 25 శాతం రాయితీ దక్కుతుంది. ఈ మార్గాలను మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDAA) నిర్వహిస్తాయి. ఛార్జీల రాయితీ ప్రయోజనం పొందడానికి, సంబంధిత పత్రాలను చూపించవలసి ఉంటుంది.