Delhi High Court made it clear that women are entitled to live in in laws Home: వివాహితకు అత్తమామల ఇంట్లో నివసించేందుకు అర్హత ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అయిన మహిళకు తమ అత్తారింట్లో నివసించేందుకు గృహహింస చట్టం ప్రకారం పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం సంక్రమించే హక్కులకు, గృహహింస చట్టం ద్వారా వచ్చే హక్కులు, అర్హతలో కొన్ని మార్పులు ఉంటాయి. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదని చెబుతూ హైకోర్టు జడ్జీల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సెషన్ కోర్టుకు అత్తామామలు..
కోడలుకు తమ ఇంట్లో ఉండే హక్కు లేదని తీర్పు ఇవ్వాలని అడిషనల్ సెషన్ కోర్టును అత్తామామలు ఆశ్రయించారు. కానీ వారికి అక్కడ నిరాశే ఎదురైంది. వివాహం అయిన మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు, అర్హత ఉందని అడిషనల్ సెషన్ కోర్టు (Additional Sessions Court) తీర్పు ఇవ్వడంతో అత్తామామలు షాకయ్యారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్తామామలు హైకోర్టును ఆశ్రయించారు. కోడలికి తమ ఇంట్లో ఉండే హక్కు లేదని, ఆస్తిపై సైతం ఎలాంటి హక్కులు ఉండవని అత్తామామలు తమ వాదన వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ చంద్రధారి సింగ్ వీరి పిటిషన్‌ను కొట్టివేశారు. అడిషనల్ సెషన్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ.. కోడలికి అత్తవారింట్లో నివసించేందుకు అర్హత, హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
పదేళ్ల నుంచి వేరుగా నివాసం..
గతంలో కోడలు తమతో సత్సంబంధాలు కలిగి ఉండేదని, ఆ తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. 16 సెప్టెంబర్ 2011న తమ ఇంటిని వదిలి కోడలు వెళ్లిపోయిందని అత్తామామలు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు 60 సివిల్, క్రిమినల్ కేసులు ఫైల్ చేసుకున్నారు. అందులో ఒక కేసు గృహ హింస చట్టం 2005 ప్రకారం వివాహితకు రక్షణ కల్పించడం. అత్తవారింటికి తిరిగి వచ్చేందుకు కోడల్ని అత్తామామలు అంగీకరించలేదు. దాంతో తనకు ఇంట్లో నివసించే అర్హత ఉందని, తనకు అత్తవారింటి ఆస్తిపై హక్కు సైతం ఉందని కోడలు క్లెయిమ్ చేశారు.
కోడలికి తమ ఆస్తిపై హక్కు లేదని, తమ ఇంట్లో ఉండేందుకు ఆమెకు అర్హత లేదని అత్తామామలు సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి నిరాశే ఎదురైంది. గృహహింస చట్టం ప్రకారం కోడలికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అత్తామామలపై ఉందని, కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు ఉందని సెషన్ కోర్టు జడ్జి తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అత్తామామలు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ అత్తామామలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.
Also Read: Delhi: ఇంతకంటే ఘోరం ఉందా? 2 నెలల పసికందును మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టిన కన్నతల్లి