Delhi High Court: 


అబార్షన్‌కి అనుమతి..


ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓ మహిళ తన 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు పిటిషన్ వేయగా అందుకు అంగీకరించింది. భర్తతో కలిసి ఉన్నప్పుడు గర్భం దాల్చిన మహిళ..ఆ తరవాత విడిపోయింది. అయితే...ప్రస్తుతం తనకు బిడ్డను కనడం ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకునేందుకు అనుమతినివ్వాలని కోర్టుని ఆశ్రయించింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ఈ పిటిషన్‌ని విచారించారు. AIIMS వైద్యులూ కోర్టుకి కీలక వివరాలు వెల్లడించారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం వల్ల ప్రాణానికేమీ ప్రమాదం లేదని చెప్పారు. ఈ వాదననూ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...అందుకు అంగీకరించింది. మహిళ తరపున న్యాయవాది కోర్టులో గట్టిగానే వాదించారు. Medical Termination of Pregnany Act లోని ప్రొవిజన్స్ ప్రకారం..ఈ సమయంలో అబార్షన్ చేయడం సురక్షితమే అని కోర్టుకి వివరించారు. కోర్టు అనుమతినివ్వక ముందు AIIMSకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో అబార్షన్ చేయొచ్చా లేదా చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ మెడికల్ బోర్డ్‌ని నియమించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పునిచ్చే సమయంలో మహిళతో పాటు ఆమె భర్త కూడా కోర్టుకి వచ్చాడు. భర్తతో కలిసి ఉండడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆ మహిళ కోర్టుకి తేల్చి చెప్పింది. భర్త మాత్రం ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. అందుకు భార్య అంగీకరించలేదు. పైగా..భర్తపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఏడాది మేలో ఇద్దరికీ పెళ్లైంది. జూన్‌లో ఆమె గర్భం దాల్చింది. ఇన్ని నెలల్లో తనను భర్త తీవ్రంగా వేధించాడని, శారీరకంగా హింసించాడని ఫిర్యాదు చేసింది. గర్భవతినని చూడకుండా కొట్టాడని చెప్పింది. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రస్తావించింది. బిడ్డని పోషించే స్తోమత లేనప్పుడు ఆ మహిళకు అబార్షన్ చేయించుకునే అవకాశం కల్పించాలని వెల్లడించింది.