Delhi Floods:
వీడని వరద ముప్పు..
ఢిల్లీని వరద ముప్పు వదిలిపోవడం లేదు. యమునా నది శాంతించినట్టే కనిపిస్తున్నా వరద నీళ్లు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు చాలడం లేదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని స్థితిగతులపై ఆరా తీశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి యమునా నది నీటిమట్టం భారీగా పెరిగింది. ఇక హత్నికుండ్ బ్యారేజ్ గేట్లు ఎత్తి వేయడం వల్ల ఈ వరద నీరు మరీ ఉద్ధృతంగా ప్రవహించింది. మొత్తం నగరాన్ని చుట్టుముట్టింది. సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇవాళ ఉదయం నాటికి (జులై 16) యమునా నది నీటి మట్టం 206.14 మీటర్లకు చేరుకుంది. ఈ వరద ముంచెత్తడం వల్ల రాజ్‌ఘాట్ మార్గం అంతా నీళ్లు నిలిచిపోయాయి.
మయూర్ విహార్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడి ప్రజలందరినీ రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని అనుకునే లోపే మళ్లీ వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల ఆందోళన చెందుతున్నారు.
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా యమునా బజార్‌లో పర్యటించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీళ్లు అలాగే నిలిచిపోయాయి. శనివారం (జులై 15) ఢిల్లీలో మరోసారి భారీ వర్షాలు కురిశాయి. అసలే వరదలతో సతమతం అవుతున్న నగరాన్ని మరింత ముంచేశాయి ఈ వానలు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.