Delhi flood vedio: దేశ రాజధాని ఢిల్లీ యమునా నది గుప్పిట్లో బిక్కుబిక్కుమంటుంది. ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరుల కార్యాలయాలు నీట మునిగాయి. రాజ్‌ఘాట్ నుంచి సచివాలయం వరకు ఉన్న రోడ్డు కూడా మునిగింది. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. యమునా నది ఒడ్డు నుంచి కేవలం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో, వరద నీటిలో చిక్కుకున్న రింగ్ రోడ్డుకు సమీపంలో ఇండియా గేట్ ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని పాఠశాలలకు ప్రభుత్వం సెల వులు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆదేశించింది. 


వరదలోనే రిక్షా రైడ్...


ఓవైపు నగరంలో ఎటుచూసిన వరద నీరు మాత్రమే కనిపిస్తుంది. వరద వల్ల రోడ్లన్నీ మునిగిపోవడంతో ప్రజలంతా ఇళ్లకే పరితమయ్యారు. కానీ, ఓ కార్మికుడు మాత్రం ఛాతి లోతు వరద నీటిలో రిక్షా తొక్కుతూ దర్శనమిచ్చాడు. యమునా నదిలో వరద ఉద్ధృతి కారణంగా ఎర్రకోట సమీపంలో వరద నీరంతా రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆ వరద నీటిలోనే రిక్షా తొక్కడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వరద నీటిలో రిక్షాను కాసేపు తొక్కు, మరి కాసేపు నీటిని వెనక్కి నెడుతూ తాను ముందుకు సాగాడు రిక్షా కార్మికుడు. ఏ మాత్రం జంకు లేకుండా పాటలు పాడుతూ మరి రిక్షాను నడిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోపై అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీని వరద నీరు ముంచెత్తినా తాను దానిని కూడా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 


 






45 ఏళ్ల రికార్డు బ్రేక్...


భారీ వర్షాల కారణంగా యమునా నది ఉగ్రరూపం దాల్చి ఢిల్లీని వరదల్లో ముంచెత్తింది. ఢిల్లీలో ఈ తీరు వరద ప్రవాహం 45 ఏళ్ల రికార్డును అధిగమించిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు యమునా నది నీటి ప్రవాహం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. నదీ ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, యమునా నది పైన రెండు ప్రధాన ఆనకట్టలు ఉన్నాయి. డెహ్రాడూన్‌లోని డక్‌పథర్, యమునా నగర్‌లోని హత్నికుండ్‌లలో ఈ ఆనకట్టలు ఉన్నాయి. వర్షాకాలంలో కురిసే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుండటం లేదు. అత్యధిక నీరు వరద రూపంలో ఢిల్లీ నగరంలోకి వస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ, హత్నికుండ్ నుంచి నీరు గతం కన్నా చాలా వేగంగా ఢిల్లీకి చేరుకుందన్నారు. దీనికి ప్రధాన కారణం దురాక్రమణలేనని చెప్పారు. గతంలో నీరు వెళ్ళడానికి ఎక్కువ స్థలం ఉండేదని, ఇప్పుడు చిన్న చిన్న స్థలాల్లో పారుతోందని చెప్పారు.