Delhi Earthquake:
ఢిల్లీ, NCR ప్రాంతాల్లో భూకంపం భయాందోళనకు గురి చేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూమి ఉన్నట్టుండి ఒక్కసారిగా కంపించింది. అక్టోబర్ 3వ తేదీన ఇలాగే భూమి కంపించింది. ఇప్పుడు మరోసారి భయపెట్టింది. పరిసర ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. దాదాపు 10కిలోమీటర్ల లోతు వరకూ ఈ భూకంప ప్రభావం కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4.08 నిముషాలకు భూకంపం నమోదైందని తెలిపారు.
ఫరియాబాద్‌కి 9 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు National Center for Seismology తెలిపింది. ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొంత మంది ఆఫీస్‌లు ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చేశారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు కాలేదు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ నెలలోనే ఢిల్లీలో భూకంపం నమోదవడం ఇది రెండోసారి. ఎక్కువగా ఢిల్లీ-NCR ప్రాంతాల్లోనే ఈ ప్రభావం కనిపిస్తోంది. అటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, లఖ్‌నవూ, హపూర్, అమ్రోహలోనూ తరచూ భూకంపాలు నమోదవుతున్నాయి. ఇటీవల నేపాల్‌లో భూమి కంపించడం వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించింది.
అక్టోబర్ 3న ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లతో పాటు నేపాల్ లో భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నేపాల్ లో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లో పలుచోట్ల దాదాపు 10 సెకన్ల పాటు భారీగా భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని అధికారులు చెప్పారు. దేశ రాజధాని నాల్గవ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. ఆగస్టు 5న ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 181 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అప్పట్లో తెలిపింది. అఫ్గనిస్థాన్‌లోనూ మరోసారి భూకంపం సంభవించింది. వారం రోజులుగా అక్కడ ఏదో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది. ఈ ధాటికి వేలాది మంది పౌరులు మృతి చెందారు.
Also Read: Afghan Earthquake: అఫ్గనిస్థాన్‌లో మరోసారి భూకంపం, అంచనా వేయలేనంతగా విధ్వంసం!