Afghan Earthquake: 



మరోసారి భూకంపం..


అఫ్గనిస్థాన్‌ని వరుస భూకంపాలు (Afghanistan Earthquake) వణికిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. మరోసారి పశ్చిమ అఫ్గనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది. యూఎస్ జియాలజికల్ సర్వే ఈ విషయం వెల్లడించింది. దాదాపు వారం రోజులుగా అక్కడ ఎక్కడో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది. హీరత్‌ సిటీకి 34 కిలోమీటర్ల మేర ఈ భూకంప తీవ్రత కనిపించింది. భూగర్భంలో దాదాపు 8 కిలోమీటర్ల వరకూ ఈ ప్రభావం కనిపించింది. ఆ తరవాత మరోసారి 5.5 తీవ్రతతో భూమి కంపించింది. అయితే..వీటి వల్ల ఎంత నష్టం వాటిల్లింది అన్నది ఇంకా తెలియలేదు. వారం రోజుల క్రితం వచ్చిన భూకంపాలతో చాలా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 90% మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి అధికారుల వెల్లడించారు. తాలిబన్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ భూకంపాల కారణంగా 2 వేల మంది మృతి చెందారు. జెండా జన్ (Zenda Jan Earthquake) లోనే దాదాపు 1,294 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,688 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొదటి సారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 6.3 గా నమోదైంది. చాలా వరకూ గ్రామాల ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయాయి. అంతా మట్టే మిగిలిపోయింది. స్కూళ్లు, హాస్పిటల్స్ కూడా నేలమట్టమయ్యాయి. చాలా మంది తమ వాళ్ల కోసం గాలిస్తున్నారు. భూకంప సమయంలో ఎవరి దారిలో వాళ్లు పరుగులు పెట్టారు. ఇప్పుడు తమ వాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ఆ శిథిలాల మధ్యే జల్లెడ పడుతున్నారు. 


 భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి క్షతగాత్రులతో కిటకిటలాడుతోంది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా ఇప్పటివరకూ అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఐక్యరాజ్యసమితి యొక్క మానవతా కార్యాలయం భూకంప ప్రతిస్పందన కోసం 5 మిలియన్ డాలర్లు విలువైన సాయం ప్రకటించింది. తాలిబాన్లు అఫ్ఘాన్‌లో పాలనను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం నిలిపివేశారు.అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది.  పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు.