Kailash Choudhary:


కైలాశ్ చౌదరి వ్యాఖ్యలు..


కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి ( Union Minister Kailash Choudhary) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...భారత్ మాతాకీ జై అన్న వాళ్లకే ఇండియాలో స్థానం ఉంటుందని తేల్చిచెప్పారు. భారత్‌లో ఉన్న ప్రతిఒక్కరూ కచ్చితంగా ఈ నినాదం వినిపించాలని అన్నారు. కొంత మంది రాజకీయ నాయకులు ఈ విషయంలోనూ వివాదాలు రాజేస్తున్నారని, వాళ్లందరికీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలే అన్ని రాష్ట్రాల్లో కనిపించాలని అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఉంటూ కూడా భారత్‌ మాతాకీ జై అని నినాదం చేయకపోవడం కన్నా దారుణం ఇంకేదీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "భారత్‌లో ఉండాలనుకుంటే..భారత్ మాతాకీ జై అని నినదించాల్సిందే" అని స్పష్టం చేశారు. అంతే కాదు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్ నినాదాలు చేస్తారా..? అని ప్రశ్నించారు. 


"వందేమాతరం, భారత్ మాతా కీ జై అని నినదించే వాళ్లకి మాత్రమే భారత దేశంలో చోటు ఉంటుంది. ఇక్కడ ఉంటూ పాకిస్థాన్‌కి జై కొడతారా..? ఎవరికైనా ఇలా నినదించాలని లేకపోయినా...హిందుస్థాన్‌పై నమ్మకం లేకున్నా వాళ్లంతా పాకిస్థాన్ జిందాబాద్ అని జై కొడుతున్నారు. అలాంటి వాళ్లకి భారత్‌లో చోటు లేదు. వాళ్లు పాకిస్థాన్‌కి వెళ్లిపోవచ్చు. ఏ దేశానికైనా జాతీయవాదం ఉండాలి"


- కైలాశ్ చౌదరి, కేంద్ర మంత్రి 


ఇదే సభలో I.N.D.I.A కూటమిపైనా విమర్శలు చేశారు కైలాశ్ చౌదరి. కాంగ్రెస్‌ని లక్ష్యంగాచేసుకుని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ముందు మహాత్మా గాంధీ పేరుని దొంగిలించిందని అన్నారు. స్వాతంత్ర్యం సాధించుకోడానికి ఏర్పాటైన పార్టీ చివరకు ఇలా తయారైందని మండి పడ్డారు. 


"విపక్షాలు తమ కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌కి ఇలా పేర్లు దొంగిలించడం కొత్తేమీ కాదు. మహాత్మా గాంధీ పేరుని ముందుగా లాగేసుకుంది. అందుకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అని పేర్లు మారిపోయాయి. ఆ పేరు దొంగిలించి మహాత్ముడిలా మారిపోయామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా పేరుపై పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఆగిపోతాయని అప్పట్లో గాంధీజీ చెప్పారు. కానీ కాంగ్రెస్ ఆయన పేరునే దొంగిలించి రాజకీయం చేసింది. యూపీఏ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారు"


- కైలాశ్ చౌదరి, కేంద్ర మంత్రి