అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శక్తిగా తీర్చిదిద్దేందుకు..."మేక్ ఇండియా నంబర్ వన్" కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు అందరికీ ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలు, మహిళలకు సమానహక్కులు, రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధరలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. "మేక్ ఇండియా నంబర్ వన్" కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములై, ఆయా లక్ష్యాల దిశలో కలిసివచ్చేలా దేశంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు చెప్పారు. 


మనమే ఎందుకు వెనుకబడ్డాం?






"ఇది కేవలం ఓ రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమం కాదు, జాతీయ లక్ష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ సహా రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సింగపూర్ లాంటి ఎన్నో దేశాలకు భారత్ తర్వాతే స్వాతంత్ర్యం వచ్చినా మనకంటే అవి ఎంతో ముందున్నాయని కేజ్రివాల్ పేర్కొన్నారు. తెలివైన, కష్టించి పనిచేసే ప్రజలున్నా దేశం ఇంకా ఎందుకు వెనుకబడిపోతోందని ఆయన ప్రశ్నించారు. 


అంతకుముందు... ప్రాథమిక విద్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణలో దిల్లీ సాధించిన అనుభవాన్ని దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలని కేజ్రివాల్ కేంద్రాన్ని కోరారు. ఉచిత విద్య, ఆరోగ్యాన్ని తాయిలాలుగా భావించవద్దని విజ్ఞప్తి చేశారు. 






సంక్షేమ పథకాలను అలా అనొద్దు


ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న మిఠాయి సంస్కృతి పట్ల ప్రజలు అప్రమత్తగా ఉండాలని గత నెలలో ప్రధాని మోదీ హెచ్చరించారు. దేశ భవిష్యత్తుకు అది ప్రమాదకరంగా మారుతుందన్నారు. ఈ క్రమంలో విద్య, వైద్యం అభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేజ్రివాల్‌... వాటిని తాయిలాలుగా పిలవడం సబబు కాదన్నారు.