BJP Lakshman :  భారతీయ జనతా పార్టీ తమ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను పునర్‌వ్యవస్థీకరించింది. కొంత మంది సీనియర్లను తొలగించి కొత్త వారికి చాన్సిచ్చింది. బీజేపీలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఈ బోర్డులో మొత్తం పదకొండు మందికి చోటు కల్పించారు. వీరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్‌తో పాటు హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. తెలంగాణ నుంచి ఇటీవలే రాజ్యసభ సీటు పొందిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. 



మాజీ సీఎంలు యడ్యూరప్ప, సోనోవాల్‌లకు పార్లమెంటరీ బోర్డులో చోటు 


అలాగే ఇటీవల ముఖ్యమంత్రి పదవుల నుంచి తప్పించిన యడ్యూరప్ప, షర్బానంద సోనోవాల్ వంటి నేతలకు చోటిచ్చారు. ఇక్బాల్ సింగ్ లాలాపురి,శ్రీమతి సుధాయాదవ్, సత్యనారాయణ జతియా, బీ.ఎల్.సంతోష్‌లు మిగిలిన సభ్యులు. ఈ బోర్డుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వం వహిస్తారు.  అయితే అత్యున్నత కమిటీ నుండి నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నేతల్ని తొలగించడం బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది. ఎప్పటికప్పుడు కొంత మంది సీనియర్లను పక్కన పెడుతూ ఉంటారు.  


నితిన్ గడ్కరీ,  శివరాజ్ సింగ్ చౌహాన్‌లను ఎందుకు పక్కన పెట్టారు ? 



ఆ ప్రకారం ఇప్పుడు నితిన్ గడ్కరీ, చౌహాన్ వంతు వచ్చిందేమోనన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల కమిటీని కూడా పునర్ వ్యవస్థీకరించారు. ఎన్నికల కమిటీ ఎప్పుడు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ కమిటీలోనూ తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ లక్ష్మణ్‌కు చోటిచ్చారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు మాత్రం చోటు దక్కలేదు. 



ఎన్నికల కమిటీలోనూ సీనియర్లకు దక్కని చోటు


జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్‌, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జటియా , కేఎల్‌ సంతోష్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌, ఓమ్ మథుర్‌, వనతి శ్రీనివాస్‌కు చోటు కల్పించారు.  అయితే బీజేపీలో  ఏదైనా పార్టీ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని.. సీనియర్లను పార్లమెంటరీ బోర్డు నుంచి  తప్పించినంత మాత్రాన.. వారికి ప్రాధాన్యం తగ్గించినట్లు కాదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.