Salary Hike: ఉద్యోగులకు శుభవార్త! వచ్చే ఏడాది మీ వేతనాల్లో భారీ పెరుగుదల ఉంటుందట. అట్రిషన్‌ రేట్‌ పెరగడం, ప్రతిభావంతులు దొరక్కపోవడంతో 2023లో 10 శాతం మేర వేతనాలు వృద్ధి ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. 


గతేడాది భారత్‌లో వేతనాల బడ్జెట్‌ వృద్ధి 9.5 శాతంగా ఉండగా 2022-23లో 10 శాతానికి పెరిగిందని గ్లోబల్‌ అడ్వైజరీ, బ్రోకింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ విలిస్ టవర్స్‌ వాట్సన్‌ (WTW) నివేదిక పేర్కొంది. 2022, ఏప్రిల్‌, మేలో ప్రపంచ వ్యాప్తంగా 168 దేశాల్లో ఈ సర్వే చేపట్టగా మన దేశంలో 590 కంపెనీలు పాల్గొన్నాయి.


గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత్‌లోని సగం కంపెనీల (58%) అధిక వేతనాల బడ్జెట్‌ భారీగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 24.4 శాతం కంపెనీలు మాత్రం బడ్జెట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. 2021-22లో  5.4 శాతం కంపెనీల బడ్జెట్‌లు మాత్రమే తగ్గాయి.


ఆసియా పసిఫిక్‌ (APAC) ప్రాంతంలో భారత్‌లోనే అత్యధిక వేతనాల పెరుగుదల (10 శాతం) ఉందని నివేదిక  వెల్లడించింది. చైనాలో వేతనాల పెరుగుదల 6 శాతంగా ఉండనుంది. హాంకాంగ్‌, సింగపూర్‌లో 4 శాతం చొప్పున అంచనా వేశారు. 


వచ్చే ఏడాది తమ వ్యాపార ఆదాయం సానుకూలంగా ఉంటుందని భారత్‌లో 42 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. 7.2 శాతం కంపెనీలు మాత్రమే ప్రతికూలత వ్యక్తం చేశాయి. కాగా ఐటీ (65.5%), ఇంజినీరింగ్‌ (52.9%), సేల్స్‌ (౩5.4%), సాంకేతిక నైపుణ్యాల వ్యాపారం (32.5%), ఫైనాన్స్‌ (17.5%) కంపెనీల్లో నియామకాలు జోరందుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో హాంకాంగ్‌ తర్వాత అత్యధిక అట్రిషన్‌ రేట్‌ భారత్‌(15.1%) లోనే ఉందని పేర్కొంది.


'గతేడాది బడ్జెట్‌ను మించే వేతనాలు పెంచారు. వ్యాపారాలు మెరుగ్గా సాగడం, నైపుణ్యం గల ఉద్యోగుల అవసరం ఇందుకు కారణాలు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ 2023లో వ్యాపార ఆదాయం బాగుంటుందని అంచనా. మరోవైపు లేబర్‌ మార్కెట్లో ఒత్తిడి నెలకొంది' అని విలిస్ టవర్స్‌ వాట్సన్‌ ప్రతినిధి రజుల్‌ మాథుర్‌ అన్నారు.


'ఆర్థిక సేవలు, బ్యాంకింగ్‌ టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌ రంగాల్లో వేతనాల పెరుగుదల వరుసగా 10.4 %, 10.2 %, 10 శాతంగా ఉండనుంది. 2022 తరహాలోనే 2023లోనూ వేతనాలు పెరుగుతాయి. టెక్నాలజీ, డిజిటల్‌ నైపుణ్యాలు తెలిసిన ప్రతిభావంతుల అవసరం పెరిగింది. ప్రదర్శన మెరుగవ్వడంతో 2021-22లో చర వేతనం బాగానే చెల్లించారు. ప్రతిభావంతుల కోసం వేరియబుల్‌ పే శాతాన్ని పెంచుతున్నారు. ఉద్యోగుల్ని తమ వద్దే ఉంచుకొనేందుకు ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఫ్లెక్సిబులిటీ వర్క్‌ కల్చర్‌ ప్రవేశపెడుతున్నాయి' అని మాథుర్‌ పేర్కొన్నారు.


Also Read: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!


Also Read: యురేకా! ఏడాది తర్వాత 60,000ని తాకిన సెన్సెక్స్‌! భారీ లాభాల్లో మార్కెట్లు