Kerala Court:


కచ్చితమైన సాక్ష్యాధారాలు కావాలి: కోజికోడ్ సెషన్స్ కోర్టు 


లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ రచయిత, సోషల్ యాక్టివిస్ట్ సివిక్ చంద్రన్‌కు బెయిల్ ఇచ్చింది కేరళలోని కోజికోడ్ సెషన్స్ కోర్టు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే సంచలనమయ్యాయి. "ఓ మహిళ రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరించిన సమయంలో, 
పురుషుడు ఆకర్షణకు లోను కావడాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేం. 74 ఏళ్లున్న వ్యక్తి..పైగా దివ్యాంగుడు..ఆయన ఓ మహిళను ఒళ్లో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడనటం నమ్మశక్యంగా లేదు" అని కేరళ సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. ఇండియన్ పీనల్ కోడ్‌IPCలోని 345A ప్రకారం ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు చెల్లవని చెప్పింది. "ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ మహిళకు సంబంధించిన కొన్ని ఫోటోలను కోర్టు ముందుంచారు. అందులో ఆమె వస్త్రధారణ రెచ్చగొట్టే విధంగా ఉంది" అని వెల్లడించింది.


కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్ట్‌లోని జడ్జ్ ఎస్ కృష్ణకుమార్ ఈ సంచనల తీర్పునిచ్చారు. ఫిర్యాదు చేసిన మహిళ కచ్చితమైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి, తన గౌరవానికి భంగం కలిగిందని చెప్పగలిగితే కేసు వేయాలని స్పష్టం చేశారు. 2020 ఫిబ్రవరిలో సివిక్ చంద్రన్ కొయిలని అనే ప్రాంతంలో నంది బీచ్‌ వద్ద క్యాంపెయిన్ నిర్వహించారని, ఆ సమయంలోనే సివిక్ చంద్రన్ తన చేయి పట్టుకుని లాగాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది ఓ మహిళ. అయితే సివిక్ చంద్రన తరపు న్యాయవాదులు ఇది కేవలం ఆయనపై కక్ష తీర్చుకునేందుకు అల్లిన కట్టుకథ అని వాదించారు. ఆ సంఘటన జరిగిన ఆర్నెల్ల తరవాత కేసుపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ భిన్న వాదనలు విన్న తరవాత సెషన్స్ కోర్ట్ సివిక్ చంద్రన్‌కు బెయిల్ మంజూరు చేసింది.









 


గతంలోనూ ఇలాంటి సంచలన తీర్పులు..


ఇదే కాదు. గతంలో ఎన్నో సార్లు కోర్టులు ఇలాంటి సంచలన తీర్పులిచ్చాయి. మహిళ ఇష్టపూర్వకంగా ఓ వ్యక్తితో సహజీవనం చేశాక, ఏదో ఓ కారణంగా గొడవైతే....ఆ వ్యక్తిపై అత్యాచార కేసు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కేసుని విచారించే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఓ మహిళ నాలుగేళ్ల పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి, మనస్పర్ధలతో విడిపోయాక అతనిని అత్యాచార కేసు పెట్టింది. నాలుగేళ్ల క్రితం అతనితో సహజీవనం సాగించే సమయానికి, పిటిషన్‌దారుకి 21 ఏళ్లున్నాయని గుర్తు చేసింది ధర్మాసనం. ఇష్టపూర్వకంగానే అతనితో సహజీవనం చేసిందని, ఇప్పుడు ఉన్నట్టుండి అత్యాచార కేసు పెట్టడం కోర్టు ఒప్పుకోదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటమూ సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అన్సార్ మహమ్మద్‌...ప్రి అరెస్ట్ బెయిల్ వారెంట్ ఇవ్వాలని రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే రాజస్థాన్ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫలితంగా... సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు అన్సార్. ఆ సమయంలోనే సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


Also Read: SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు