Heavy Floods to Godavari: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. ముంపు గ్రామాల్లోని సహాయక చర్యల్లో భాగంగా మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఐయినవిల్లి, మామిడి కుదురులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాస్తున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం చర్యలు అందిస్తోంది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..!
కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. వంశధార - నాగావళి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే గొట్టా బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 30,712 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గే వరకు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలయినంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చెబుతున్నారు.
ఆదివారం నుంచి జల దిగ్బంధంలోనే గ్రామాలు..
మూడు రోజుల కిందట.. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారేజీలో నీటిమట్టం 14.90 అడుగులు ఉండగా.. సముద్రంలో14,62,217 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 14.80కు చేరుగా.. కడలిలోకి 14,44,414 క్యూసెక్కుల నీటని వదిలారు. దీని వల్ల కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోన్ని చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నాయి.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరగడంతో భద్రాచలం వల్ల గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలోకి 54.6 ఉంది. దీనికి అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 15.08 లక్షల క్యూసెక్కుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళ వారం నీటిమట్టం 44 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అలాగే మరింత నీటి మట్టం పెరగిన కారణంగా సోమవారం రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 55 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది.